భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు సహజం. భార్య అలకలు, భర్త బుజ్జగింపులు కూడా సర్వ సాధారణం. అయితే.. భార్యాభర్తలిద్దరిలో ఎవరో ఒకరు ఎదుటి మనిషిని అర్థం చేసుకుని.. సర్ది చెప్పుకుని ముందుకు సాగిపోతే ఆ కాపురం సాఫీగా సాగుతుంది. అలా కాకుండా ఇద్దరూ ఒకరినిఒకరు నిందించుకుంటూ, చీటికీమాటికీ గొడవ పడుతూ ఉంటే భార్యాభర్తలిద్దరికీ మనశ్శాంతి కరువవుతుంది.
ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటే.. తమిళనాడులోని ఓ భార్య పెళ్లి అయిన నాలుగు నెలలకే భర్తను చంపేసింది. ఎవరూ చూడని సమయంలో.. ఇంటికి దగ్గర్లో ఉన్న పాడుబడిన బావిలోకి భర్త మృతదేహాన్ని పడేసి చేతులు దులుపుకుంది. దాదాపు రెండు వారాల తర్వాత అతనిని భార్యే చంపేసి బావిలోకి నెట్టేసిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... పుదుకొట్టై జిల్లాలోని పెరుంగలూరు పంచాయతీ పరిధిలోని బోరం గ్రామానికి చెందిన పండితురై అనే 29 ఏళ్ల యువకుడికి, నందిని అనే 23 ఏళ్ల యువతికి పెద్దలు నాలుగు నెలల క్రితం పెళ్లి జరిపించారు.
పెళ్లయిన కొత్తలో ఎక్కువ జంటలు ఎంతో ఆనందంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి మధుర క్షణాలను ఆస్వాదిస్తుంటారు. పెళ్లయిన కొత్తలో అంతగా గొడవలు తలెత్తే అవకాశం ఉండదు. కానీ.. నందిని, పండితురై విషయంలో ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. పెళ్లయి నెల రోజులు తిరగక ముందే ఈ జంట మధ్య గొడవలు మొదలయ్యాయి. అయిన దానికీ, కాని దానికీ గొడవ పడుతూ ఉండేవారు. పెద్దలు సర్ది చెప్పినా భార్యాభర్తల తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. నాలుగు నెలల నుంచి ఇదే తంతు. కొత్తగా పెళ్లయిందన్న ఆనందం, సంతోషం ఇద్దరిలో ఏ ఒక్కరిలోనూ లేదు. భార్యపై భర్త విసుక్కోవడం, భర్త ప్రవర్తన పట్ల భార్య ఆవేదన చెంది ఏడుస్తూ కూర్చోవడం.
ఇలా ఉన్న క్రమంలో.. సెప్టెంబర్ 20 నుంచి పండితురై కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా కనిపించలేదు. దీంతో.. పండితురై తల్లి మీనాక్షి అదనకొట్టై పోలీస్ స్టేషన్‌లో తన కొడుకు కనిపించకుండా పోయాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం వెతుకులాట సాగించారు. ఈ క్రమంలో.. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవం వెలుగులోకొచ్చింది.
ఆ నిజం తెలిసి పండితురై కుటుంబంతో పాటు ఆ గ్రామస్తులు కూడా షాకయ్యారు. పోలీసులు ఈ కేసులో పండితురై భార్య నందినిని అనుమానితురాలిగా భావించి విచారించగా అసలు పండితురై ఏమయ్యాడన్న నిజం బయటపడింది. పండితురైని తానే చంపేసి.. ఇంటి వెనకున్న పాడుబడిన బావిలోకి శవాన్ని పడేశానని నందిని చెప్పింది.
సెప్టెంబర్ 20న తన భర్తతో గొడవ జరిగిందని, తన భర్త కత్తితో గొంతు కోయాలని చూశాడని.. దీంతో.. దొరికిన వస్తువుతో అతని తలపై కొట్టానని, దెబ్బ తీవ్రంగా తగలడంతో అతను చనిపోయాడని నందిని పోలీసుల విచారణలో తెలిపింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన భర్త మృతదేహాన్ని ఎవరూ చూడకుండా ఇంటికి దగ్గర్లో ఉన్న పాడుబడిన బావిలోకి తోసేశానని నందిని చెప్పింది. దీంతో.. ఈ కేసు మిస్టరీ వీడింది. నందిని చెప్పిన సమాచారంతో పోలీసులు ఆ బావిలో ఉన్న పండితురై మృతదేహాన్ని వెలికితీయించారు. చనిపోయి దాదాపు 15 రోజులు కావస్తుండటంతో శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న స్థితిలో ఉంది. పోలీసులు నందినిని అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Latest news, Married women, Tamilnadu, Telangana crime news, Wife kills husband