news18
Updated: November 15, 2020, 8:51 AM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 15, 2020, 8:51 AM IST
చెప్పుడు మాటలు విని.. బంగారం లాంటి కాపురాలను నాశనం చేసుకుంటున్న వార్తలు ఈ మధ్య ఆందోళన కలిగిస్తున్నవి. పవిత్రమైన వివాహ బంధానికి ఇవి మాయని మచ్చగా మిగులుతున్నాయి. అన్యోన్యంగా కలిసుండాల్సిన దంపతుల మధ్య వస్తున్న మనస్పర్థలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వాటిని మరింత జఠిలం చేసుకుంటున్నారు. ఫలితం.. ప్రాణాలు తీసుకుంటున్నారు. దీంతో వారి సంతానం దిక్కులేని వారవుతున్నారు. జ్యోతిష్యుడు చెప్పాడని ఒక వ్యక్తి తన భార్యను హతమార్చిన ఘటన కర్నాటకలో కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం... బెంగళూరు కు చెందిన అశ్వినికి తొమ్మిది నెలల క్రితం యువరాజ్ తో వివాహమైంది. కాలేజీ రోజుల నుంచే వారి మధ్య పరిచయముంది. తనను పెళ్లి చేసుకోవాలని నాలుగేళ్ల పాటు తిరిగాడు యువరాజ్. దీంతో ఆమె ఒప్పుకుంది. కానీ ఆమె చదువు ముగిసిన తర్వాత ఆ యువతి తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. దీంతో ఆ యువతి బాధ్యత వాళ్ల అమ్మమ్మ చూసుకుంది. కోరుకున్న పెళ్లి చేసుకున్న అశ్విని, యువరాజ్.. వివాహం అయిన తర్వాత కొన్నిరోజులు పాటు సంతోషంగానే ఉన్నారు.
ఇంతలో కొంత కాలానికి యువరాజ్ ఉద్యోగం కోల్పోయాడు. మళ్లీ ఎంత ట్రై చేసినా జాబ్ రాలేదు. దీంతో యువరాజ్ ఒక జ్యోతిష్యుడిని కలిశాడు. తన సమస్య వివరించాడు. జాబ్ తో పాటు యువరాజ్.. తన భార్య గురించి కూడా అడిగాడు. అయితే.. ఆమెకు పిల్లలు కారని.. పిల్లలు కాని మహిళను ఎందుకు పెళ్లి చేసుకున్నావని నిలదీశాడు. నీ సమస్యలన్నింటికీ కారణం ఆమేనని బెదిరించాడు. ఆమెను హతమార్చితేనే నీవు బాగుపడతావని యువరాజ్ కు నూరిపోశాడు.
జ్యోతిష్యుడి మాటలు విన్న యువరాజ్.. అశ్వినితో తరుచూ గొడవకు దిగేవాడు. ఇదే క్రమంలో గత శుక్రవారం.. ఆమెపై దాడి చేశాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. గొంతునులిమాడు. దీంతో అశ్విని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కాగా.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా... అశ్విని చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.
బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Published by:
Srinivas Munigala
First published:
November 15, 2020, 8:51 AM IST