ఓ వివాహిత ప్రమాదవశాత్తు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరింది. గత నెలలో మహిళ గాయపడితే కుటుంబ సభ్యులు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. సుమారు 18రోజులుగా చికిత్స పొందుతూ రెండ్రోజుల క్రితం చనిపోయింది. అయితే ఆమె మరణానంతరం నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. ఆమె ప్రమాదవశాత్తు చనిపోలేదని ..పథకం ప్రకారం హత్య చేసినట్లుగా ఆమె కుమార్తె పోలీసు(Police)లకు ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం కేసులో నిందితుడు ఎవరో కాదు తన తండ్రేనంటూ కంప్లైంట్‌లో పేర్కొనడంతో పోలీసులు షాక్ అయ్యారు. సిద్దిపేట(Siddipet)జిల్లా ములుగు(Mulugu)లో జరిగిన ఈకేసులో అసలు భర్త ఆమెను ఎలా చంపాడు..? ఎందుకు చంపాడో తెలిస్తే షాక్ అవుతారు.
హత్యగా మారిన వివాహిత మృతి కేసు..
సిద్దిపేట జిల్లా ములుగులో గత నెల 18వ తేది శివరాత్రి రోజున తిరునగర్ నవ్యశ్రీ అనే వివాహిత ఒంటికి నిప్పంటుకొని కాలిపోతూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది. అది గమనించిన చుట్టుపక్కల వాళ్లు, భర్త ఆమెపై నీళ్లు పోసి మంటలు చల్లార్చారు. వెంటనే పేట్‌బహిరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సుమారు 18రోజుల పాటు చికిత్స పొందుతూ నవ్యశ్రీ సోమవారం కన్నుమూసింది. అయితే కాలిన గాయలతో ఉన్నప్పుడే పోలీసులు ఆమె దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. శివరాత్రి రోజున ఉపవాసం ముగిన తర్వాత తన చీర కొంగుకు దీపం మంట అంటుకుందని చెప్పింది. మృతురాలు నవ్యశ్రీ మరణానంతరం ఆమె పెద్దకుమార్తె ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని..తన తండ్రే అమ్మపై శానిటైజర్ పోసి నిప్పంటించాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తాను అడ్డుపడినప్పటికి అమ్మను కాల్చి చంపాడంటూ ఫిర్యాదులో పేర్కొంది.
తండ్రిపై కూతురు కంప్లైంట్..
మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నవ్యశ్రీ భర్త నరేందర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడ్ని పిలిపించి తమదైన శైలీలో విచారించారు. నిందితుడిగా గుర్తించి అతనిపై 302,201,506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు మరణంగా నమోదైన కేసు కూతురు ఫిర్యాదుతో హత్య కేసుగా మారింది. మృతురాలు నవ్యశ్రీకి 15ఏళ్ల క్రితమే సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని తునికి బొల్లారంకు చెందిన నరేందర్‌తో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భార్యను చంపడానికి కారణాలు ఏంటనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అదనపు కట్నం కోసం హతమార్చాడా లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని కూపీ లాగుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Siddipet, Telangana crime news, Women died