జీవితాంతం తనను కంటికి రెప్పలా కాపాడుతానని ప్రమాణం చేసిన భర్త... ఆ భార్యను కాదన్నాడు. తనపై మోజు తీరిపోయి.. మరో మహిళ వలలో పడి ఆ భార్య ను వదిలిపెట్టడానికి చూశాడు. ఆమె చెడిపోయిందని.. తనను చెరిచిన వాడి దగ్గరికే వెళ్లాలని సూచిస్తూ.. సభ్య సమాజం తలదించుకునేలా చేశాడో భర్త. 12 ఏళ్ల పెళ్లి బంధాన్ని.. ఐదుగురు పిల్లల తల్లి అయిన భార్యను వదిలి మరో మహిళతో వివాహం చేసుకున్నాడా భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివిగో.. ఫిలిబిత్ కు చెందిన మహిళకు 12 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ఆమెకు ఐదుగురు పిల్లలు. కాగా, రెండేళ్ల నుంచి ఆమె ఒంట్లో భాగోక అనారోగ్యంతో మంచం పట్టింది. దీంతో ఆమె భర్త.. రెండో వివాహం చేసుకున్నాడు. భార్య, పిల్లలు వాదిస్తున్న వినకుండా పెళ్లి తంతు పూర్తి చేశాడు. ఇదిలాఉండగా... గతేడాది సెప్టెంబర్ 20న మొదటి భార్య ఇంట్లో ఉండగా భర్త సోదరుడు ఆమె దగ్గరికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఆమెను రేప్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె.. తన తల్లి, భర్తకు వివరించింది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన ఆ తల్లి, భర్త... తనదే తప్పన్నట్టుగా చూశారు. ఈ విషయాన్ని మరిచిపోవాలని సూచించారు.
ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఆమె భర్త, అత్తమామలు, ఇతర బంధువులు కలిసి ఆమెను ఇంటి నుంచి పంపించడానికి కుట్ర పన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నదని కూడా చూడకుండా ఆమెపై దాడి చేశారు. అనుకున్నట్టుగానే ఆమెను ఇంటి నుంచి పంపించారు. దీంతో ఆమెను పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు కోర్టు దాకా వెళ్లింది. గతేడాది డిసెంబర్ 4న ఆమె న్యాయవిచారణకు హాజరైంది. విచారించిన కోర్టు.. భర్త తో పాటు అత్తమామలు, బంధువులను దోషులుగా తేల్చింది. ఆమెనుతిరిగి ఆ ఇంట్లోనే ఉండేలా అవకాశం కల్పించింది. అయినా కూడా ఆ భర్త, అత్తమామలలో మార్పురాలేదు. ఆమెను తన తమ్ముడు రేప్ చేశాడు కాబట్టి తనతోనే వెళ్లి బతకాలని ఆ భర్త వేధించడం ప్రారంభించాడు. తన దగ్గర ఉండకూడదని.. ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆమె మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ భర్తను, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Published by:Srinivas Munigala
First published:January 18, 2021, 23:21 IST