HUSBAND DIED IN ROAD ACCIDENT EXACTLY ON FIRST MARRIAGE DAY AND ONE MONTH AFTER WIFE GIVES BIRTH TO BABY IN CHITTOOR HSN
Chittoor: ఏడాది క్రితం ప్రేమ పెళ్లి.. నెల రోజుల క్రితమే పుట్టిన కూతురు.. సరిగ్గా మొదటి పెళ్లి రోజే జరిగిందో ఘోరం..!
భార్య పాపతో భర్త శివ
సరిగ్గా ఏడాది క్రితం అతడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. నెల రోజుల క్రితమే అతడి భార్య ఓ పాపకు జన్మనిచ్చింది. పాప, భర్తతో కలిసి మొదటి మొదటి పెళ్లి రోజును జరుపుకోవాలనుకున్న ఆ భార్యకు కన్నీరే మిగిలింది..
ఒక్క రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. పెళ్లయిన ఏడాదికే ఆ భార్యకు తన భర్తను దూరం చేసింది. నెల రోజుల క్రితం పుట్టిన ఓ పాపకు తండ్రిని దూరం చేసింది. జీవిత చరమాంకంలో తమను చూసుకుంటాడన్న ధీమాతో ఉన్న ఆ తల్లిదండ్రులకు కొడుకును దూరం చేసింది. ఆ కుటుంబానికి ఉన్న కొండంత ఆసరాను హఠాత్తుగా లాగేసుకున్నట్టయింది. కన్న బిడ్డ అల్లరిని మనసారా ఆస్వాదించకుండానే, ఆ పాప ముసిముసి నవ్వులను చూసి మురిసిపోకుండానే ఓ వ్యక్తి కన్నుమూశాడు. అది కూడా సరిగ్గా పెళ్లయిన ఏడాదికే మరణించాడు. నెల రోజుల క్రితం పుట్టిన పాపతో, భర్తతో కలిసి మొదటి వివాహ మహోత్సవం జరుపుకుందామని ఆశతో ఉన్న ఆ భార్యకు కన్నీరే మిగిలింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మఠంపల్లెకు చెందిన మునిరాజ, లక్ష్మీకాంతమ్మకు శివ అనే కుమారుడు ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన పవిత్ర అనే యువతిని ప్రేమించాడు. కొన్నాళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. విషయాన్ని ఇరు కుటుంబాల్లోని పెద్దలకు చెప్పాడు. అబ్బాయి కూడా బుద్ధిమంతుడేనన్న పేరు ఉండటంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఓకే చెప్పారు. శివ తల్లిదండ్రులు కూడా కుమారుడి అభీష్టానికి అడ్డు చెప్పలేదు. దీంతో ఇరుకుటుంబాల సమ్మతంతో గతేడాది ఏప్రిల్ 16న శివ, పవిత్ర పెళ్లి జరిగింది. తిరుపతిలోని అను ఫ్లెక్సీలో డిజిటల్ అసిస్టెంట్ గా శివ పనిచేస్తున్నాడు. దాని ద్వారా వచ్చే ఆదాయంతో కుటంబాన్ని పోషిస్తున్నాడు.
పెళ్లయిన రెండు నెలలకే భార్య గర్భవతి అయింది. ఒక నెల రోజుల క్రితమే పవిత్ర పండంటి పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిందని శివ మురిసిపోయాడు. రోజూ పాపతో ఆడుకునేవాడు. పని నుంచి తిరిగి రాగానే పాపతోనే సమయం గడిపేవాడు. పాప పుట్టి నెల రోజులు కూడా గడవకముందే ఊహించని ఘోరం జరిగిపోయింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో విధులు ముగించుకుని బైక్ పై సొంతూరికి శివ వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శివ మరణించాడు. స్థానికులు శివను ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు విషయం తెలిసి కుప్పకూలిపోయారు. ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సరిగ్గా మొదటి పెళ్లి రోజే ఈ ఘటన జరగడం శోచనీయం. శివ మృతదేహాన్ని చూసి భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.