భార్యకు పుట్టింటి వాళ్లు ఇచ్చిన ఆస్తి పై ఆ భర్త కన్నేశాడు. బలాదూర్‌గా తిరుగుతూ పైసా సంపాదించకుండా తన పుట్టింటి ఆస్తిని అడిగితే ఇవ్వలేదని కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పిల్లల్ని ఊరికి పంపి.. ఆనక ఆమెను కసిదీరా కొట్టాడు. ఇంకా కోపం తీరక మెడకు ఉరేసి చంపేశాడు. ఓ గోనె సంచిలో మృతదేహాన్ని తీసుకెళ్లి మైళ్ల దూరంలోని పాడుబడిన ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనిలో పడేశాడు. ఊరు నుంచి తిరిగొచ్చిన పిల్లలు తల్లి కనిపించడం లేదని ప్రశ్నిస్తే సమాధానం తేడాగా ఉండడంతో.. తల్లిపైన బెంగతో కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ కుటుంబ పెద్ద బాధ్యతా రాహిత్యం ఎక్కడకు దిగజార్చిందో ఈ ఘటన చాటిచెబుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ పరిధిలో ఉండే హనుమాతండాలో జరిగిందీ ఘాతుకం.
వివరాల్లోకెళ్తే... భద్రాద్రి కొత్తగూడెంలోని మారుమూల గిరిజనతండాకు చెందిన గుగులోత్ భాస్కర్‌కు పదహారేళ్ల క్రితం కొత్తతండాకు చెందిన మంగను ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లయిన దగ్గరి నుంచి భాస్కర్ బలాదూర్‌గా తిరిగేవాడు. కుటుంబానికి సంబంధించిన ఎలాంటి బాధ్యతను తీసుకునేవాడు కాదు. దీంతో మంగ తన కష్టంతో కుటుంబాన్ని లాక్కొచ్చేది. అయినా ఆమెను ఓర్వలేని భాస్కర్ తన తండ్రి, తోబుట్టువులతో కలసి ఆమెను వేధిస్తుండేవాడు. అప్పుడప్పుడూ తల్లిదండ్రులు రావడం.. పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించడం.. ఇద్దరికీ సర్దిచెప్పి మంగకు ధైర్యం నూరిపోయడం చేసేవాళ్లు. అయితే అసలే ఇద్దరు పిల్లలు, ఆమె భర్త బాధ్యత లేకుండా తిరుగుతుండడంతో మంగ పుట్టింటివాళ్లు ఆమెకు కొంత ఆస్తిని ఇచ్చారు. ఆమె తదనంతరం పిల్లలకు చెందేలా డాక్యుమెంట్ రాశారు.
పిల్లల భవిష్యత్ కోసం ఆ ఆస్తిని మంగ కాపాడుకుంటూ వస్తోంది. తన తిరుగుళ్లకు, వ్యసనాలకు అవసరమైన డబ్బు ఇవ్వడం లేదని, పుట్టింటి వాళ్లు ఇచ్చిన ఆస్తిని తనకు అప్పగించాలని భాస్కర్ కొంత కాలంగా వేధిస్తున్నాడు. అయినా ఆమె మొండి ధైర్యంతో పిల్లల కోసం అన్నట్టుగా బతుకీడుస్తోంది. దీంతో ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకుంటే ఆస్తిని దక్కించుకోవచ్చన్న దురాశతో భాస్కర్ ఆమెను కడతేర్చే సమయం కోసం చూస్తున్నాడు.
ఇది కూడా చదవండి.. ‘కలిసి బతకకున్నా.. కలిసి చనిపోదాం..’ కామారెడ్డిలో ఓ ప్రేమ జంట విషాదం
ముందుగా పన్నిన పథకంలో భాగంగా డిసెంబరు 1వ తేదీన పిల్లలను తీసుకుని ఓ శుభకార్యానికి అని చెప్పి భాస్కర్ తల్లిదండ్రులు ఊరెళ్లారు. ఆ రాత్రి భాస్కర్ మంగతో గొడవపెట్టుకున్నాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. ఇంకా కసి తీరకపోవడంతో మెడకు ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత తీరిగ్గా మృతదేహాన్ని గోనె సంచిలో వేసుకుని దాదాపు ఇరవై మైళ్ల దూరం పైగా తీసుకెళ్లి కారేపల్లి మండలం శాంతినగర్ సమీపంలో నిర్వహణలోలేని ఓపెన్‌కాస్ట్ గనిలో పడేశాడు. డిసెంబరు 2న సాయంత్రం ఇంటికొచ్చేసరికి తల్లి లేకపోవడంతో పిల్లలు ప్రశ్నించారు. తండ్రి, తాత, బాబాయిలు సమాధానం దాట వేయడంతో అనుమానం వచ్చిన కుమార్తె మమత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.
పదిరోజులైనా తల్లి రాకపోవడంతో పిల్లలు మేనమామ ఈశ్వర్‌కు సమాచారం ఇచ్చారు. అతను పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో భర్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కేవలం భార్య పుట్టింటివాళ్లు ఇచ్చిన ఆస్తికోసమే చంపానని భాస్కర్ నేరం ఒప్పుకున్నాడు. దీంతో భాస్కర్‌ను తీసుకుని మృతదేహాన్ని పడేసిన ప్రదేశానికి వెళ్లిన పోలీసులకు మరో ట్విస్ట్ ఎదురైంది. అక్కడే పడేశానని చెబుతున్నా.. మృతదేహం ఎంతసేపటికీ కనిపించలేదు. దీంతో మనుషులను పురమాయించి వెతగ్గా.. బొగ్గు తోడగా తోడగా పడిన వంద అడుగుల లోయను ఆనుకుని ఓ చెట్టులో మృతదేహం ఉన్న గోనెసంచి వేళ్లాడుతున్న విషయాన్ని గమనించారు. అక్కడనుంచి అతి కష్టం మీద తీసుకొచ్చి బంధువులకు అప్పగించారు.
ఇది కూడా చదవండి.. కాళ్ల పారాణి ఆరకముందే... రక్తపు మడుగులో నవ దంపతులు.. కామారెడ్డిలో దారుణం
తండ్రి పట్టించుకోకపోయినా తమ తల్లి నిత్యం కష్టం చేస్తూ తమను చదివిస్తోందని, ఇలా అన్యాయంగా తమ కన్నతల్లిని చంపిన తండ్రి భాస్కర్‌ను కఠినంగా శిక్షించాలని పిల్లలు విలపిస్తూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసును తొలుత మిస్సింగ్ గా భావించి, దర్యాప్తును ఆలస్యం చేసిన పోలీసులపై మృతురాలి బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Crime, Crime news, Husband kill wife, Khammam, Murder, Telangana, Telangana News