హోమ్ /వార్తలు /క్రైమ్ /

డామిట్‌.. కథ అడ్డం తిరిగింది..!! చంపాలని వచ్చి అడ్డంగా బుక్కయ్యారు

డామిట్‌.. కథ అడ్డం తిరిగింది..!! చంపాలని వచ్చి అడ్డంగా బుక్కయ్యారు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమించి పెళ్లాడిన భర్తే.. భార్యను చంపేయాలంటూ సుపారీ ఇచ్చాడు. తల్లిదండ్రులను ఎదిరించి, కులాంతర వివాహం చేసుకున్నా.. ఆ భర్త దానిని కూడా మరిచాడు. ఇతరులతో మాట్లాడటం, కలివిడిగా ఉండటం చూసి ఓర్వలేకపోయాడు. పోలీసుల చాకచక్యంతో ఆమె ప్రాణాలు దక్కాయి.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

  (జి. శ్రీనివాసరెడ్డి, న్యూస్ 18 తెలుగు, ఖమ్మం)

తాళికట్టి జీవితాంతం రక్షణగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం వ్యక్తే చంపడానికి సిద్ధమయ్యాడు. తన పెళ్లినాటి ప్రమాణాలను విస్మరించాడు. కట్టుకున్న భార్యను చంపేయాలని కిరాయి మనుషులకు సుపారీ ఇచ్చాడు. తననే నమ్ముకుని తల్లిదండ్రులను, కుటుంబ పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్న ఇల్లాలినే కడతేర్చాలని కసిగా నిర్ణయించుకున్నాడు. తన జీవిత సహచరి ప్రాణాలను మూడు లక్షలకు వెలకట్టాడు. సుపారీ తీసుకున్న కిరాయి దుండగులు నేరుగా ఆమె పనిచేసే కోర్టులోనే చంపేయాలని నిర్ణయించుకున్నారు. కోర్టు ఆవరణలోనే ఆమె గురించి వాకబు చేశారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. వాళ్లు వివరాలు అడిగింది మఫ్టీలో ఉన్న ఓ పోలీసును. అంతే అనుమానించి పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన పోలీసులు షార్ప్‌గా స్పందించారు. నిమిషాల వ్యవధిలోనే ఆ ఆగంతకులను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించి ఇంటరాగేషన్‌ చేశారు. నివ్వెరపోయే నిజాలను కక్కించారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

రజిత.. స్వతంత్ర భావాలు కలిగిన యువతి. న్యాయశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించిన అనంతరం సర్వీస్‌ కమిషన్‌ ద్వారా అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలోనే పరిచయం అయిన వేముల అశోక్‌ ను ప్రేమించింది. కులాలు అడ్డొచ్చినా తన చదువు, తెలివితేటలతో పెద్దలను ఒప్పించింది. వివాహం చేసుకుంది. ఆమె స్వస్థలం మంచిర్యాల. అతనిది గోదావరిఖని. ఓ పాప పుట్టిన అనంతరం ఆమెకు.. అతనికి మధ్య ఇగోలు పెరిగాయి. వృత్తిరీత్యా ఆమె నిత్యం పోలీసు అధికారులు, ఇతర న్యాయవాదులతో కలివిడిగా ఉండడం అతనికి నచ్చలేదు. మాటమాట పెరిగింది. ఇక అతనితో పడలేక పాపను తీసుకుని దూరంగా వచ్చేసింది. వీరిద్దరికీ సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో ఆమెను అడ్డు తొలగించుకోడానికి మర్డర్ ప్లాన్ చేసి సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది.

khammam, khammam news, illendu, illendu court, murder attempt
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

రజితకు రెండేళ్ల క్రితం మంచిర్యాల నుంచి ఇల్లెందు కోర్టుకు బదిలీ అయింది. ఇక్కడ ఆమె తన పనితాను చేసుకుంటూ సమర్థమంతమైన అధికారిణిగా పేరుతెచ్చుకున్నారు. అటు కోర్టు స్టాఫ్‌, ఇటు పోలీసుశాఖతోనూ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తనను కాదని వెళ్లిన భార్య స్వతంత్రంగా, అదీ ధైర్యంగా భరోసాగా బతకడం నచ్చని అశోక్‌ ఆమెపై ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకున్నాడు.

నేరుగా ఏమీ చేయలేక దొంగదెబ్బ తీయాలని పన్నాగం పన్నాడు. ఆమెను ఎలాగైనా అంతమొందించాలన్న ఆలోచనతో అవకాశం కోసం ఎదురుచూశాడు. దీనికోసం బయటివారైతే ఇబ్బంది అవుతుందని ఇల్లెందు పట్టణంపై అవగాహన ఉన్న వారిని ఎంచుకోవడం కోసం తెలిసిన వాళ్ల ద్వారా ప్రయత్నాలు చేశాడు. వేరే స్నేహితుల ద్వారా పరిచయం అయిన నేలకొండపల్లికి చెందిన భూక్యా వీరబాబు, కొత్తూరు ప్రసాద్‌లతో బేరం కుదుర్చుకున్నాడు. తన భార్య రజితను చంపేయడానికి రూ.3 లక్షలకు సుపారీ కుదిరింది. కోర్టు ఆవరణలోనే దాడి చేసి చంపేయాలని నిర్ణయించారు. సాధారణంగా సోమవారాల్లో కోర్టు ప్రాంగణం రద్దీగా ఉంటుంది కనుక అదే కరెక్ట్ ప్లేస్‌ అనుకున్నారు. పైగా తమను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకు వీరబాబు, ప్రసాద్ లు తాము నడుపుతున్న బైక్‌కు ప్రెస్‌ స్టిక్కర్‌ను వేయించారు. సాధారణంగా ఎవరైనా పోలీసులు ఆపితే ప్రెస్‌ అని చెప్పడానికి ఎలిబీ సృష్టించారు. నేరుగా ఇల్లెందు కోర్టుకు చేరుకున్నారు.

అయితే అంతమందిలో ఆమెను గుర్తించడం ఎలా..? ఎవరో ఒకరిని వాకబు చేయాలనుకున్నారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని ఆమె ఎక్కడ కూర్చుంటుంది..? ఏ టైంకు బయటకు వస్తుంది..? ఇంటికి ఎలా వెళ్తుందంటూ ప్రశ్నించారు. దీంతో మఫ్టీలో ఉన్న హోంగార్డ్‌కు అనుమానం వచ్చింది. విషయాన్ని కోర్టు కానిస్టేబుల్‌కు చెప్పారు.

ఆయన వెంటనే విషయాన్ని డీఎస్పీ రవీందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీ ఆదేశాలతో కాసేపటికే సీఐ బరపటి రమేష్‌ తన సిబ్బందితో వచ్చారు. కోర్టు ఆవరణలో అనుమానంగా సంచరిస్తున్న వీరబాబు, ప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని కాల్‌లిస్ట్‌ పరిశీలించారు. వారి నుంచి ఏపీపీ రజిత భర్త వేముల అశోక్‌కు కాంటాక్ట్స్‌ ఉన్నట్టు తేలింది. వాళ్ల వద్ద దాచి ఉంచిన రెండు పదునైన కత్తులను స్వాధీనం చేసుకున్నారు.


పోలీసుల తక్షణ స్పందనతో ఓ ప్రాణం కాపాడినట్లయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇలాంటి దారుణానికి సిద్ధపడడంతో ఆమె నివ్వెరపోయింది. చిన్నచిన్న అపోహలు కొంత కాలానికి సమసిపోతాయిలే అనుకుంటూ ఆశగా జీవిస్తున్న ఆమె నమ్మకాన్ని అతను వమ్ము చేశాడు. చివరకు కట్టుకున్న భార్యనే కడతేర్చాలన్న ప్రయత్నంలో అడ్డంగా రెడ్‌హ్యాండెడ్‌గా బుక్‌ అయ్యాడు.

First published:

Tags: Crime, Khammam, Murder attempt, Telangana