భార్య గర్భవతి అయిందంటే చాలు భర్త ఆనందంతో ఎగిరిగంతేస్తాడు. హ్యాపీగా ఫీలవుతాడు. అయితే అందరూ కాకున్నా కొందరు మాత్రం ఓ వింత డిమాండ్ ను తెరపైకి తీసుకొస్తారు. ‘నాకు వారసుడిని కనివ్వాలి‘ అంటూ డిమాండ్ చేస్తారు. అబ్బాయినే కనివ్వాలంటారు. అదేమీ తన చేతుల్లో లేదని ఆ భార్యకు తెలుసు. కానీ ఆమె మాత్రం మౌనంగానే ఉండిపోతుంది. పొరపాటున భర్త, అత్తింటి వారి ఆశకు తగ్గట్టుగా కాకుండా అమ్మాయి కనుక పుడితే అప్పుడు మొదలవుతాయి అసలు ఆరళ్లు. నరకానికి కేరాఫ్ అడ్రస్ అత్తింట్లోనే ఉందనేలా చేస్తారు. అదనపు కట్నం వేధింపుల దగ్గర నుంచి అక్రమ సంబంధాలను అంటగట్టడం వరకు అన్నింటినీ చేస్తారు. చివరకు హత్య చేసేందుకు కూడా వెనకాడరు. పంజాబ్ రాష్ట్రంలో తాజాగా అలాంటి ఘటనే జరిగింది. మగబిడ్డను కనివ్వలేదని ఓ భర్త తన భార్యపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పంజాబ్ రాష్ట్రంలోని పాఠియాలా జిల్లాలో నౌగవనం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోని ఓ వ్యక్తికి చాలా కాలం క్రితమే పెళ్లయింది. అయిదేళ్ల, మూడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు వస్తున్నాయి. తనకు మగబిడ్డను కనివ్వమంటే ఆడ పిల్లను కనిచ్చావంటూ ఆ భర్త సూటి పోటి మాటలతో దూషించేవాడు. భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. అతడి వేధింపులను తట్టుకోలేని ఆమె ఒకటి రెండు సార్లు పంచాయితీ కూడా పెట్టించింది. అయినప్పటికీ అతడిలో మాత్రం మార్పు రాలేదు.
ఈ క్రమంలోనే గురువారం సాయత్రం ఆ భర్త తన భార్యతో గొడవ పడ్డాడు. ఇతరులతో అక్రమ సంబంధం ఉందంటూ అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెను దుర్భాషలాడాడు. ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా తనతోపాటు తెచ్చుకున్న యాసిడ్ ను ఆమెపై జల్లాడు. ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలయిన ఆమె అల్లాడిపోయింది. స్థానికులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందనీ, 60శాతం ఆమె శరీరంపై యాసిడ్ గాయాలు అయ్యాయని వైద్యులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Wife kill husband