మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నేరం.. చట్టబద్ధంగానే కాదు ప్రాణాలకు కూడా మహా డేంజర్. ఫుల్లుగా తాగి, ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు వందల్లో ఉన్నారు. అయినా మార్పు రావడం లేదు సరికదా.. ఇంకా రెచ్చిపోతున్నారు. అందుకనే పోలీసులు రాత్రి వేళల్లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తూ వారి ఆగడాలకు కత్తెర వేస్తున్నారు. ముఖ్యంగా వారాంతంలో హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఏరియాల్లో మాటు వేసి మందుబాబుల భరతం పడుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, బేగంపేట్‌లలో పబ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే, పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు తాగుబోతులు కొత్త దారులు వెతుక్కున్నారు. అదేంటో తెలిస్తే.. మీరూ షాక్ అవుతారు. అదే.. వాట్సాప్. మందుబాబులంతా కలిసి కొన్ని వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడైనా డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ జరిగితే ఆ వైపు వెళ్లొద్దని ఆ గ్రూప్‌లో సందేశం పోస్టు చేస్తారు. ఇంకేముంది.. తాగుబోతులు ఆ వైపు వెళ్లకుండా, ప్రత్యామ్నాయ దారి వెతుక్కొని వెళ్లిపోతున్నారు.
ఉదాహారణకు, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ జరిగిందనుకోండి.. గ్రూపు సభ్యుడు ఆ వైపు వెళ్తే, వెంటనే ‘drunken drive test at jubilee check post’ అని గ్రూపులో పోస్ట్ చేస్తాడు. దాన్ని చూసిన గ్రూపు సభ్యులంతా ఆ వైపు వెళ్లకుండా వేరే దారుల గుండా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిపోతున్నారు.
అదే కాదు.. గూగుల్ మ్యాప్స్ కూడా వారికి వరంగా మారింది. రాత్రి వేళల్లో ట్రాఫిక్ ఉండదు. వీకెండ్‌లో అసలే ఉండదు. ఆ సమయంలో గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ చెక్ చేస్తే అంతా గ్రీన్ మార్కు కనిపిస్తుంది. ఏదేని ప్రాంతంలో రెడ్ మార్కు కనిపిస్తే.. అక్కడ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నట్లు గుర్తిస్తూ ఆ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో యువకులు, విద్యార్థులు, మధ్య వయస్కులు, చిన్న స్థాయి నటీనటులు ఉంటున్నట్లు తెలిసింది.
దీనిపై పోలీసుల వివరణ కోరగా.. వాట్సాప్ గ్రూపుల గురించి తమకూ తెలిసిందని, వారిని నియంత్రించడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని, అయితే, సాధ్యమైనంత వరకు తాగుబోతులు పారిపోకుండా చాలా ప్రాంతాల్లో నిఘా వేస్తున్నామని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) అనిల్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది జూన్ నాటికి హైదరాబాద్‌లో 15,133 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో 2,215 కేసులు, జూన్‌లో 2,770 కేసులు నమోదయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad police, Police, TRAFFIC AWARENESS, TS Police