"మీ భర్తను ఎలా చంపాలి" అనే వ్యాసం రాసిన అమెరికా (America) రచయిత్రికి తాజాగా ఒరెగాన్ (Oregon) కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష (Life Sentence) విధించింది. ఈ వ్యాసం రాసినందుకే ఆమెకు శిక్ష పడిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ మహిళ అంతకుమించిన నేరం చేసింది. ఈమె నిజంగానే తన భర్తను దారుణంగా కాల్చి చంపింది. అందుకే ఆమెకు సోమవారం నాడు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ హంతకురాలు కొన్నేళ్ల క్రితం "మీ భర్తను ఎలా హత్య చేయాలి - హౌ టు కిల్ యువర్ హస్బెండ్ (How To Murder Your Husband)" అనే అంశంపై ఒక భయంకరమైన వ్యాసం రాసింది. ఆ తర్వాత నిజంగానే తన భర్తను సెకండ్ డిగ్రీ మర్డర్ (Murder) చేసి కటకటాల పాలైంది. నాన్సీ గతంలో ఈ వ్యాసం రాయడం ద్వారా బాగా పేరు పొందింది. అయితే నాన్సీ గత నెలలో తన భర్తను హత్య చేసినట్లు కోర్టు అధికారికంగా నిర్ధారించింది.
నాన్సీ క్రాంప్టన్ 2018లో 1.5 మిలియన్ డాలర్ల జీవిత బీమా మనీ కోసం తన భర్తను కాల్చివేసినట్లు ధర్మాసనం గుర్తించింది. నాన్సీ సెల్ఫ్-పబ్లిష్డ్ ఆథర్‌గా ఉండేది. ఆమె రాసిన రొమాన్స్ & సస్పెన్స్‌ల రచనలలో 'ది రాంగ్ హస్బెండ్', 'ది రాంగ్ లవర్' వంటి వింత నవలలు పాపులర్ అయ్యాయి. ఆమె భర్త డేనియల్ బ్రోఫీ ఒరెగాన్ క్యులినరీ ఇన్‌స్టిట్యూట్‌లో చెఫ్‌గా, ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. అయితే నాన్సీ అతన్ని జూన్ 2018లో ఇన్‌స్టిట్యూట్‌లోని వంటగదిలో రెండుసార్లు కాల్చి దారుణంగా హతమార్చింది. సంఘటన జరిగిన సమయంలో ఆమె అదే ప్రాంతంలో డ్రైవింగ్ చేస్తున్నట్టు చూపించిన సీసీటీవీ ఫుటేజీని పోలీస్ అధికారులు గుర్తించారు.
నాన్సీ విచారణ ఒక నెల పాటు కొనసాగింది. విచారణ సమయంలో, ఈమె ఈ-బే (e-bay) ద్వారా తుపాకీ బారెల్‌ను కొనుగోలు చేసినట్లు తేలింది. అయితే, నాన్సీ తన కొత్త నవల కోసం అధ్యయనం చేయడానికి ఆయుధాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొంది. కానీ కోర్టు ఆమె వ్యాఖ్యలను తోసిపుచ్చింది. అయితే విచారణలో నాన్సీ దంపతులు చాలాకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు అధికారులు తెలుసుకున్నారు.
ఈ క్రమంలో జీవిత బీమా మొత్తం వసూలు చేసే ఆశతోనే తన భర్తను చంపడానికి ఆమె రెడీ అయ్యిందని, అంతకుమించి ఎటువంటి కారణం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే వాయువ్య రాష్ట్రమైన ఒరెగాన్‌లోని ఒక న్యాయమూర్తి నాన్సీ 25 ఏళ్లలో పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పారు.
ఇది కూడా చదవండి : పాలమూరు జిల్లాలో పచ్చి మోసం .. యాప్ ద్వారా 10కోట్లతో వేలాది మందికి పంగనామం
ఇప్పటికీ ఆన్‌లైన్‌లో విస్తృతంగా అందుబాటులో ఉన్న "హౌ టు కిల్ యువర్ హస్బెండ్" అనే ఆమె కథనం, అవసరం లేని భాగస్వామిని ఎన్ని మార్గాలలో హతమార్చవచ్చో రాసుకొచ్చింది. భయంకరమైన ఈ వ్యాసం రాసిన రచయిత్రి ఇప్పుడు హంతకురాలు కావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈమె గురించి అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Crime news, USA, VIRAL NEWS, Wife kills husband