(Syed Rafi, News18,Mahabubnagar)
భార్యభర్తల మధ్య సఖ్యత లేకపోతే దాని ప్రభావం ఆ కుటుంబంపైన ...కుటుంబ సభ్యులపైన పడుతుంది. మహబూబ్‌నగర్(Mahabubnagar)జిల్లాలో జరిగిన ఓ విషాద సంఘటనే ఇందుకు ఉదాహరణగా నిలిచింది. కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్య(Suicide)కు పాల్పడిన సంఘటనలో పెద్దమ్మాయి ప్రాణాలతో బయటపడగా ఇద్దరు పిల్లలు, తల్లి మృత్యు ఒడికి చేరారు. తెలంగాణ(Telangana)లో పెద్ద పండుగగా జరుపుకునే బతుకమ్మ(Batukamma) పండుగ రోజునే తల్లీ బిడ్డల మృతదేహాలు చెరువులో లభ్యమవడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. ఇల్లాలు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలోకి నెట్టింది.
పండుగ పూట విషాదం..
మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని నవాబుపేట మండలం కాకర్ల పహాడ్ కు చెందిన మైబు అనే వ్యక్తి భార్య రమాదేవి ముగ్గురు పిల్లలతో అన్యోన్యంగా ఉండేవారు. సంతూర్‌లో భర్త తాపీ మేస్త్రి, భార్య కూలి పనులు చేసుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం పనుల కోసం హైదరాబాదుకు వెళ్లారు. పెద్ద కుమార్తె నవ్యను దేవరకద్ర మండల కేంద్రంలోని కేజీబీవీలో చదివించేవారు. మేఘన, మారుతి అనే మరో ఇద్దరు కవల పిల్లలను తమ దగ్గరే ఉంచుకున్నారు. తాపీ మేస్త్రీగా పని చేస్తున్న భర్త ప్రవర్తనలో మార్పును తట్టుకోలేకపోయిన రమాదేవి పలుమార్లు హెచ్చరించింది. తీరు మార్చుకోకపోవడంతో చావే శరణ్యమని భావించింది.
క్షణికావేశంలో మరణశిక్ష..
భర్తపై కోపంతో రమాదేవి ఇద్దరు పిల్లలను తీసుకొని శనివారం ఉదయం మహబూబ్‌నగర్ కు వచ్చింది. తాను వాడే సెల్ ఫోన్‌ను హైదరాబాద్‌లోని ఇంట్లోనే ఉంచింది. దేవరకద్రకు వెళ్లి పెద్దమ్మాయి నవ్యను వెంట తీసుకెళ్లింది. తాము ఎక్కడికి వెళ్తున్నామో భర్తకు తెలియకూడదని నిర్ణయించుకొని ముగ్గురు పిల్లలతో పాటు ఆర్టీసీ బస్సులో వచ్చి సొంతూరు కాకర్ల పహాడ్ స్టేజి సమీపంలో దిగింది. రహదారి కాకుండా అడ్డదారిలో పిల్లల్ని తీసుకెళ్లి నల్లకుంట చెరువు వద్దకు తీసుకెళ్లింది.
భార్య, ఇద్దరు పిల్లు జలసమాధి..
చెరువులోకి దిగుతుండగా నీళ్లను చూస్తే భయమవుతుందని పాప మరోసారి వెనుకడుగు వేసింది. ఆ తల్లి మాత్రం ముగ్గురు పిల్లలతో పాటు నీటిలోకి వెళ్ళింది. అమ్మ చెల్లి తమ్ముడు నీళ్లలో మునిగిపోతున్నారు వాళ్లను కాపాడమంటూ పెద్దమ్మాయి కేకలు వేస్తూ మునిగిపోతూనే కంప చెట్టును పట్టుకుంది. చేతికి గుచ్చుకోవడంతో వాటిని వదలకుండా అలాగే ఉండిపోయింది. కాపాడమని కేకలు వేయడంతో కొందరు నవ్యను రక్షించారు. తమ్ముడు, చెల్లి, తల్లి ముగ్గురూ నీళ్లలో మునిగిపోయారు.
కలహాలతో కాపురం సర్వనాశనం ..
భార్యతో పాటు ఇద్దరు కవల పిల్లలు చనిపోయిన విషయం తెలుసుకున్న భర్త మైబు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నాడు. పెద్దమ్మాయి నవ్య ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలుసుకొని అక్కడికి వెళ్లాడు. ఆదివారం ఉదయం సొంత ఊరు కాకరపాడు వెళ్లడంతో రమాదేవి, పిల్లల చావుకు మైబు కారణమని భావించిన మృతురాలి తరపు బంధువులు దాడి చేసే ప్రమాదం ఉందని గ్రహించిన సర్పంచ్ నర్సింలు అతడ్ని నవాబుపేట పోలీసులకు అప్పగించారు. మైబుపై కేసు నమోదు చేసుకున్న మహబూబ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.