చోరీ జరిగిన రెండు గంటల్లోనే దొంగను పట్టేసిన పోలీసులు.. ఎలా దొరికాడంటే..

నాగయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు

తిరుమల హిల్స్ లో ఓ వృద్ధ జంట నివసిస్తోంది. వారు బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలన్నా, ఏటీఎంకు వెళ్లి డబ్బులను తెచ్చుకోవాలన్నా ఇబ్బందికరంగా ఉండటంతో సారా నాగయ్య అనే ఓ ఆటో డ్రైవర్ ను మాట్లాడుకున్నారు. ఫోన్ చేసినప్పుడల్లా వెళ్లి, వారిని ఆటోలో తీసుకెళ్తుంటాడు. వాళ్లు తమ షాపింగ్ ను పూర్తి చేసుకున్నాక తిరుమల హిల్స్ లో దించేస్తుంటాడు.

  • Share this:
    ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, మొదట తమవంతుగా ప్రయత్నించి, ఆ తర్వాత పోలీస్ కేసు పెడుతుంటారు. విషయం పోలీసుల దాకా వెళ్లిందనగానే అది తేలేసరికి ఎన్నో ఏళ్లు పడుతుందన్న అపోహకు చాలా మంది గురవుతుంటారు. కానీ ఓ కేసును అత్యంత చాకచక్యంగా రెండే రెండు గంటల్లో హైదరాబాద్ పోలీసులు పరిష్కరించారు. ఓ ఇంట్లో దోపిడీ చేసిన దొంగలను కటకటాల్లోకి నెట్టారు. సీసీటీవీ ఫుటేజీల సాయంతో ఆ దోపిడీ దొంగలను పోలీసులు సులభంగా పట్టుకోగలిగారు. వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పరిథిలోని మీర్ పేట్ తిరుమల హిల్స్ లో ఓ వృద్ధ జంట నివసిస్తోంది. వారు బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలన్నా, ఏటీఎంకు వెళ్లి డబ్బులను తెచ్చుకోవాలన్నా ఇబ్బందికరంగా ఉండటంతో సారా నాగయ్య అనే ఓ ఆటో డ్రైవర్ ను మాట్లాడుకున్నారు. ఫోన్ చేసినప్పుడల్లా వెళ్లి, వారిని ఆటోలో తీసుకెళ్తుంటాడు. వాళ్లు తమ షాపింగ్ ను పూర్తి చేసుకున్నాక తిరుమల హిల్స్ లో దించేస్తుంటాడు. దానికి గానూ నాగయ్యకు బాగానే డబ్బులు ఇస్తుండేవారు.

    దాదాపు ఐదేళ్లుగా ఆ వృద్ధ జంటతో నాగయ్యకు పరిచయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో నాగయ్య కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడాలని నాగయ్య ఓ కుత్సితమైన ఆలోచన చేశాడు. తనకు బాగా పరిచయం ఉన్న వృద్ధ జంట ఇంట్లో బంగారం, డబ్బులు దొంగతనం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందనుకున్నాడు. అప్పటి నుంచి సరైన సమయం కోసం వేచి చూడసాగాడు. జనవరి 15వ తారీఖున ఆ వృద్ధ జంట నుంచి నాగయ్యకు ఫోన్ వచ్చింది. కుక్కర్ కొనాల్సి ఉందనీ, ఉదయం పదింటికి రావాలని ఫోన్ చేశారు. దీంతో వాళ్లు చెప్పినట్టే నాగయ్య పది గంటలకు వాళ్లు ఉంటున్న ఫ్లాట్ వద్దకు వెళ్లాడు. వాళ్లను మీర్ పేట్ క్రాస్ రోడ్స్ వద్ద దింపాడు. తన ఆటోను ఓ పక్కన పెట్టాడు. షాపింగ్ పూర్తయ్యాక ఫోన్ చేయండని చెప్పాడు. అయితే వాళ్లు తమ ఇంటి తాళాలు ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయి వెళ్లారు.

    దీన్ని అదనుగా తీసుకున్న నాగయ్య ఆ ఇంటి తాళాలను తీసుకుని తన స్నేహితుడి బైక్ పై ఆ వృద్ధ జంట ఉంటున్న అపార్ట్ మెంట్ కు వెళ్లాడు. ఇంటి తలుపులు తీసి ఆరు తులాలు, ఐదు తులాలు ఉన్న రెండు బంగారు ఆభరణాలు, ఒకటిన్నర తులం గోల్డ్ చైన్, మరో రెండు బంగారు ఉంగరాలతోపాటు 75వేల నగదు, మూడు ఏటీఎం కార్డులను దొంగిలించాడు. మళ్లీ ఇంటికి తాళం వేసి వాళ్లు షాపింగ్ చేస్తున్న చోటకు వచ్చేశాడు. అయితే ఇంటికి తిరిగి వచ్చిన వృద్ధ జంట చోరీ జరిగిందని గుర్తించారు. వెంటనే మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే మీర్ పేట్ పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. 15వ తారీఖు పది గంటల తర్వాత ఎవరెవరు ఆ అపార్ట్ మెంట్ కు వచ్చారన్నది చూస్తే, ఆటో డ్రైవర్ కనిపించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. అతడు దొంగిలించిన వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు అతడు దొంగతనానికి వాడిన నాలుగు లక్షల రూపాయల విలువ చేసే స్నేహితుడి బైక్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన రెండు గంటల్లోనే దొంగలను పట్టుకోగలిని మీర్ పేట్ పోలీస్ సిబ్బందిని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ అభినందించారు.
    Published by:Hasaan Kandula
    First published: