Telangana: డబ్బులు కడితేనే శవం.. లక్షల్లో వసూలు చేస్తున్న ఆసుపత్రి యాజమాన్యాలు.. కరోనా రోగిపై ఉన్న బంగారం మాయం.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

Mahabubnagar: కరోనా ముసుగులో కొంతమంది వైద్యులు, మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అక్రమ దందాలకు తెరలేపుతున్నారు. కరోనా రోగులను భయపెట్టి భయభ్రాంతులకు గురిచేస్తూ రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటువంటి ఉదంతమే మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోగల భూత్పూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బయటపడింది.

  • Share this:
    (సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు )

    కరోనాతో చనిపోయిన రోగి నుండి బంగారు కమ్మలు మాయం చేయడమే కాకుండా మొత్తం ఫీజు చెల్లిస్తేనే శవాన్ని ఇస్తామంటూ ఏ మాత్రం కనికరం లేకుండా ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించినట్లు రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. కేవలం కరోనా పరీక్షలకు ఏకంగా రూ. 13 వేలు వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కు చెందిన 60 సంవత్సరాల కౌసల్య అనే వృద్ధురాలు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతుండటంతో భూత్పూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆమెకు చికిత్స అందించిన డాక్టర్లు కరోనా పరీక్షలతోపాటు ఇతర పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కోవిడ్ నిర్ధారణ కావడంతో అందుకు సంబంధించిన వైద్యం అందించారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆ తర్వాత వివిధ రకాల టెస్టుల కోసం ఫీజలను ఎక్కువగా వసూలు చేయడం మొదలు పెట్టారు. కోవిడ్ పరీక్షకు ప్రభుత్వం ఆదేశించిన ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేపడుతున్నారు. ఇంత ఖర్చు పెట్టినా ఆ రోగి చనిపోయింది.

    అప్పటికే వేలల్లో ఫీజు కట్టిన ప్పటికీ తిరిగి మరికొంత ఫీజు ఇవ్వాలని యజమాన్యం పట్టుబట్టింది. ఫీజు చెల్లిస్తేనే శవం ఇస్తామంటూ ఆసుపత్రి యజమాన్యం కఠినంగా వ్యవహరించింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. వృద్ధురాలు ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె చెవికి రెండు బంగారు కమ్మలు ఉన్నాయి. తీరా మృతి చెందిన తర్వాత ఆమె బంధువులు శవాన్ని పరిశీలించారు. చివరి చూపు కోసం వచ్చిన వారు ఆమె శరీరంపై నగలు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక చెవి కి బంగారు కమ్మ లేదని బంధువులు గుర్తించారు. ఈ సంఘటనపై ఆసుపత్రి యజమాన్యం మొదట్లో వివాదం చేసేందుకు ప్రయత్నించింది. కానీ బంధువులు పట్టు పట్టడంతో ఆసుపత్రిలో ఉన్న సీసీ కెమెరాల చూడడంతో అసలు విషయం బయటపడింది. సీసీ కెమెరల్లో మృతురాలు రెండు చెవులకు బంగారు కమ్మలు ఉన్నట్లు తేలింది. దీంతో దిగొచ్చిన ఆస్పత్రి యాజమాన్యం రోగి బంధువులతో బేర సారాలు చేయడం మొదలుపెట్టారు.

    అయితే కట్టాల్సిన ఫీజు చెల్లింపులో కట్ చేసుకుని మిగతా డబ్బులు కట్టమని బంధువులకు ఆస్పత్రి యాజమాన్యం సమాధానం ఇచ్చారు. చివరకు రోగి వారికి 25 వేల కు పైగా డబ్బులు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో చేసేదిలేక మృతురాలి బంధువులు వెళ్ళిపోయారు. కానీ కరోనా మృతుల దగ్గరనుండి బంగారు మాయం కావడం వెనుక అసలు విషయం ఏంటో రోగుల బంధువులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వారు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బంధువులు కోరుతున్నారు.
    Published by:Veera Babu
    First published: