కాలం మారుతున్నా.. పరువు హత్యలు తగ్గడం లేదు. తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. నచ్చిన వ్యక్తిని ఎంచుకునే అవకాశాన్ని పిల్లలకు ఇవ్వడం లేదు. పరువు కోసం కన్న పేగునే తెంచుకుంటున్నారు. తాజాగా గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. వేరే కులం యువకుడిని ప్రేమిస్తుందనే కోపంతో కన్నకూతురిని తల్లిదండ్రులు చంపేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామానికి చెందిన దివ్య అనే యువతి డిగ్రీ చదువుతోంది. ఆ యువతి వేరొక కులానికి చెందిన యువకుడిని కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో గొడవ జరిగింది. ఇకనైనా బుద్ధిగా ఉండాలని కూతురిని హెచ్చరించారు. ఐనా ఆమె వినలేదు. అతడిని పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు తమ కూతురు దివ్యను చంపేశారు. ఇద్దరూ కలిసి తమ కూతురిని గొంతు నులిమి దారుణంగా హత్యచేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.