కూతురిని తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుతారు. ఏం కావాలంటే అది తెచ్చిస్తారు. కానీ పెళ్లి వయసు వచ్చే సరికి అంతా రివర్స్ అవుతుంది. కూతురినికి నచ్చిన వాడితో కాకుండా తమకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తారు. కాదని ప్రేమ వివాహం చేసుకుంటే.. కత్తులతో నరికేస్తున్నారు. పరువు కోసం కన్న కూతుళ్లనే దారుణంగా చంపేస్తారు. మనదేశంలో నిత్యం ఏదో ఒక చోట పరువు హత్యల కేసులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లో దౌసా పట్టణంలో ఘోరం జరిగింది. దళిత యువకుడితో సహజీవనం చేస్తుందన్న కోపంతో.. కూతురిని చంపేశాడు తండ్రి. వారికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో.. ఈ దారుణం జరిగింది.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. దౌసా నగరంలోని రామ్‌కుంద్ ప్రాంతానికి చెందిన పంకీ సైనీ అనే యువతి రోషన్ మహావర్ అనే దళిత యువకుడి ప్రేమిస్తోది. విషయం తెలిసి పింకీ తల్లిదండ్రులు క్లాస్ తీసుకున్నారు. ఐనా ఆమె వినకపోవడంతో ఫిబ్రవరి 16న బలవంతంగా వేరొక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి నరకం అనుభవిస్తున్న పింకీ.. ఫిబ్రవరి 21న తన ప్రియుడు రోషన్‌తో వెళ్లిపోయింది. అనంతరం ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. తమ కుటుంబం నుంచి ముప్పు ఉంటుందనే భయంతో రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు. వారిద్దరు మేజర్లు కావడంతో.. కలిసి ఉండేందుకు అంగీకించిన హైకోర్టు..వారికి భద్రత కల్పించాలని ఆదేశించింది. కానీ పోలీసులు పట్టించుకోలేదు.
ఈ క్రమంలో మార్చి 1న రోషన్ మహావర్ ఇంటికి పింకీ తల్లిదండ్రులు వచ్చారు. ఆమెను కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారు. రోషన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడకు చేరుకొని.. పింకీ కోసం గాలించారు. కానీ ఎక్కడా కనిపించలేదు. పింకీ తల్లిదండ్రులు వెళ్లిన మార్గంలో తనిఖీలు కూడా చేశారు. ఐనా దొరకలేదు. చివరకు పింకీని చంపేశారని తెలిసి.. నేరుగా వారి ఇంటికి వెళ్లాడు. ఆమె తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తే.. అతడు నేరాన్ని అంగీకరించాడు. తన కూతురిని తానే చంపేసినట్లు ఒప్పుకున్నాడు. దళిత యువకుడితో వెళ్లిపోయినందునే ఆమెను చంపేసినట్లు పోలీసులకు చెప్పాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. హైకోర్టు ఆదేశించినా ఎందుకు రక్షణ కల్పించలేదని రోషన్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. వారు భద్రత కల్పించకపోవడం వల్లే పింకీ హత్య జరిగిందని.. పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను పాటించి ఉంటే పింకీ చనిపోయేది కాదని కన్నీళ్లు పెట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Honor Killing, Rajasthan