ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.. హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఘటనే అందుకు ఉదాహరణ. కిన్నౌర్ జిల్లా సాంగ్లా లోయలో ఒక్క సారిగా కొండచరియలు ఒకదాని వెంట ఒకటి విరిగిపడ్డాయి. అలా చూస్తుండగానే ఎవరో బాంబులు పెట్టి పేల్చినట్టు రాళ్లు ఎగిరి పడ్డాయి. భారీ శబ్ధం చేస్తూ రాళ్లు జర జర జారుకుంటూ వచ్చాయి. అలా వచ్చిన రాళ్లలో ఓ పెద్ద బండ రాయి.. ఓ భారీ వంతెననే రెండు ముక్కలు చేసింది. అంటే ప్రమాద తీవ్ర ఎంత ఉందో ఊహించవచ్చు. కొన్ని రాళ్లు పర్యాటకుల వాహనంపై పడడంతో తొమ్మిది మంది మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సాంగ్లా-చిట్కుల్ మార్గంలో బట్సేరి దగ్గర ఆదివారం మధ్యాహ్నం 1.25 గంటలకు కొండలపై నుంచి బండరాళ్లు లోయలోకి జారిపడ్డాయి. పై నుంచి దొర్లుకుంటూ వచ్చిన భారీ రాయి ఒకటి నేరుగా వంతెనపై పడడంతో ఆ కట్టడం రెండు ముక్కలైంది. పర్యాటకులతో ఉన్న టెంపో ట్రావెలర్‌పై మరో పెద్దరాయి పడడంతో అందులో ఉన్న వారిలో తొమ్మిది మంది మరణించినట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కొండచరియలు విరిగి పడి మరణించిన వారిలో రాజస్థాన్‌కు చెందినవారు నలుగురు, ఛత్తీస్‌గఢ్ కు చెందిన ఇద్దరు, మహారాష్ట్రకు చెందిన ఒకరు, ఢిల్లీ వాసులు ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు. కిన్నౌర్ జిల్లాలోనే జరిగిన ఇదే తరహా ఘటనలో ఒకరు గాయపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసినందున కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం ఇటీవలే ప్రకటించింది. కొన్ని సంవత్సరాలుగా హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగి పడుతున్న ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి. భూకంపం సంభవించినట్లు ఒక్కసారిగా.. కొండ పైనుంచి బండ రాళ్లు కిందకు వేగంగా దూసుకొచ్చాయి. రాళ్ల ధాటికి లోయలో పలు వాహనాలు, విశ్రాంతి గదులు ధ్వంసమయ్యాయి. ఆ దృశ్యాలను పలువురు పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.
ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రధాని తెలిపారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.