ప్రియాంక రెడ్డి హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో విద్యార్థులు,యువకులు ఆందోళనను ఉధృతం చేశారు. దాదాపు ఐదారు గంటల నుంచి అక్కడ వారు నిరసన చేపడుతున్నారు. అంతకంతకు అక్కడి పరిస్థితి ఉద్రిక్తతలను పెంచుతూనే ఉంది. దీంతో పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతం షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిందితులను 4.30గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే పోలీస్ స్టేషన్ బయట ఉన్న పరిస్థితుల రీత్యా స్టేషన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను మెజిస్ట్రేట్‌తో మాట్లాడించే అవకాశం ఉంది. షాద్‌నగర్ మెజిస్ట్రేట్‌కి సంబంధించిన న్యాయమూర్తి ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో మండల తహశీల్దార్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. తహశీల్దార్‌కి మెజిస్ట్రేట్ హోదా ఉంటుంది కాబట్టి సాయంత్రం లోపు మెజిస్ట్రేట్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది.
కాగా, షాద్‌నగర్‌లో శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన బారికేడ్లను విద్యార్థులు,యువకులు ధ్వంసం చేస్తున్నారు. పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా వారి ఆగ్రహావేశాలను తగ్గించడం వారి వల్ల కావడం లేదు. పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్లి నిందితులను తామే శిక్షిస్తామని అక్కడున్న యువకులు ఆవేశంగా చెబుతున్నారు. అయితే పోలీసులు చాలా సంయమనంతో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదనపు ఫోర్స్‌ను రప్పించి అక్కడి జనాన్ని నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ.. సున్నితంగా వ్యవహరించాల్సిన అంశం కావడంతో సంయమనం పాటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Priyanka reddy murder, Telangana