మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోయిల్‌కొండ మండలవాసులు చేపట్టిన ఆందోళనలతో.. ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొత్తగా నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. తమ మండలాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంచాలంటూ కోయిల్‌కొండ మండలానికి చెందిన వివిధ గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. తమ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపబోతున్నారనే ప్రచారంతో.. ప్రజలంతా ఆందోళన బాట పట్టారు. అయితే వీరి ఆందోళన కాస్తా ఉద్రిక్తతకు దారితీసింది.
ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు ఆగ్రహంతో పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో.. డ్యూటీలో ఉన్న భూత్‌పూర్ సీఐ పాండురంగా రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. రాయి బలంగా ఆయన తలకు తగలడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేశానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయగానే.. ఆయన కొత్త జిల్లా ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో భాగంగా ఉన్న నారాయణపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిన అధికారులు... కోయిల్‌కొండ మండలాన్ని అందులో కలపబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు.. నిరసనకు దిగారు. నిరసన ఉధృతం కావడంతో.. పరిస్థితిగా ఉద్రిక్తంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Crime, Telangana, Telangana Election 2018, Telangana News, TS Police