దాదాపు ఇరవై రోజులుగా దేశంలో సంచలనంగా మారిన హత్రాస్ దళిత యువతి గ్యాంగ్ రేప్ ఘటనలో.. ఆ యువతి చనిపోయిన తర్వాత ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఘటనపై సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని వివరణ కోరగా.. హింసను నివారించడానికే అలా చేశామని తెలిపింది. ఇప్పటికే ఈ ఘటన తీవ్రత దృష్ట్యా.. పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ఇదే విషయంపై విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం స్పందిస్తూ... ‘అసాధరణమైన పరిస్థితుల్లో బాధితురాలి మృతదేహాన్ని రాత్రిపూట ఖననం చేయడం జరిగింది. ఈ ఘటన క్రమంలో.. బాధితురాలు చనిపోయిందనే వార్తలు వెలువడగానే పెద్ద ఎత్తున అల్లర్లు జరిగితే అది హింసకు దారితీసే పరిణామాలున్నాయని ఇంటిలిజన్స్ నుంచి నివేదికలు అందాయి. ఆ యువతి చనిపోగానే సఫ్దర్ గంజ్ ఆస్పత్రి వద్ద పలువురు ధర్నా చేయడం.. ఆ తర్వాత ఈ ఘటనకు కులం, మతం రంగు పులిమేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగానే వ్యవహరిస్తుండటంతో ఇది భారీ హింసకు దారి తీసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతోనే ఇలా అర్ధరాత్రి దహన కార్యక్రమాలు నిర్వహించాం. ఇది శాంతి భద్రతలకు దారి తీసే ప్రమాదం ఉండటంతోనే ఇలా చేయాల్సి వచ్చింది’ అని ప్రభుత్వం నివేదిక సమర్పించింది. అంతే తప్ప దీని మీదకు ప్రభుత్వానికి ఎటువంటి దురుద్దేశం లేదని స్పష్టం చేసింది.
కొంతమంది రాజకీయ ప్రయోజనాలను ఆశించి.. ఈ ఘటనకు కులం రంగు అంటిస్తూ.. హింసను ప్రోత్సహిస్తున్నాయని కోర్టుకు అందజేసిన నివేదికలో పేర్కొంది. తద్వారా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమాలు అంతర్గతంగా జరుగుతున్నాయని తెలిపింది.
గత నెల 14న హత్రాస్ కు చెందిన దళిత యువతిపై ఉన్నత వర్గాలకు చెందిన నలుగురు యువకులు.. గ్యాంగ్ రేప్ కు పాల్పడటమే గాక.. ఆమె నాలుక కోసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. దీంతో రెండువారాల పాటు చావు బతుకుల మధ్య పోరాడిన యువతి.. ఇటీవలే కన్నుమూసింది. ఈ ఘటనానంతరం కూడా ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్ లో మరో నాలుగు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాగా హత్రాస్ ఘటనలో నిందితులను వదిలేది లేదని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Supreme Court