ఆయన తండ్రి దేశానికి ఉప ప్రధానిగా వ్యవహరించారు.. తాను ఉత్తరాదిలో కీలకమైన హర్యానాకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత.. సుదీర్ఘ కుటుంబ రాజకీయ వారసత్వంలో ఆయన కొడుకు, మనవడు ప్రస్తుతం హర్యానా ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు.. టీచర్ల నియామకాల్లో అవకతవకల కేసులో 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు.. లేటు వయసులోనూ చదువుపై పట్టుదలతో ఇటీవలే పదో తరగతి పాసయ్యారు.. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్లు.. సరిగా నడవలేరు కూడా.. ఆరోగ్యం బాగోనంత మాత్రాన చట్టం ఊరుకోదు కదా.. గతంలో చేసిన నేరాలకు సంబంధించి ఆయనకు మళ్లీ జైలు శిక్ష పడింది. అవును, మనం మాట్లాడుకుంటున్నది ఓం ప్రకాశ్ చౌతాలా (Om Prakash Chautala) గురించే..
హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలాకు మరో భారీ షాక్ తగిలింది. అక్రమ ఆస్తుల కేసులో ఢిల్లీ సీబీఐ కోర్టు ఆయనకు 4ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అక్రమాస్తుల కేసులో చౌతాలాను దోషిగా నిర్ధారిస్తూ గత వారమే తీర్పు వెలువరించిన సీబీఐ కోర్టు.. శిక్షలను ఇవాళ (మే 27, శుక్రవారం) ఖరారు చేసింది.
అక్రమాస్తుల కేసులో 4 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఓం ప్రకాశ్ చౌతాలా హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. టీచర్ల నియామకాల కుంభకోణంలో దోషిగా తేలిన ఆయన 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యారు. జైలులో ఉన్నప్పుడు 10, 12వ తరగతులు పూర్తి చేసిన ఆయనకు ఇటీవలే అధికారులు మెమోలు అందజేశారు.
ఆ సంతోషం నుంచి తేరుకునేలోపే అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితుడై, ఇప్పుడు మళ్లీ జైలులో పడ్డారు చౌతాలా. 90వ దశకాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు స్థాపించి, అధికారం సాధించిన చాలా మంది నేతలు అనతి కాలంలో రకరకాల అవినీతి కేసుల్లో జైలు పాలు కావడం లేదా కోర్టుల చుట్టూ తిరుగుతుండటం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.