Haridas murder case : కేరళలో సంచలనం సృష్టించిన సీపీఎం కార్యకర్త హరిదాస్ హత్య కేసులో ప్రధాన నిందితుడు పరకండి నిజిల్ దాస్ (38) ..రాత్రిపూట జరపిన భార్యతో వాట్సాప్ చాట్ ద్వారా పోలీసులకు దొరికిపోయాడు. భార్య ఫోన్ ను పరిశీలించి నిందితుడిని పట్టుకున్నారు. కాగా, సీపీఎం నాయకుడి హత్యకేసు నిందితులు సీపీఎం కంచుకోటల్లోనే అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిందితులు బస చేసిన ఇంటిపై గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు కూడా విసిరారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. పినరయి పాండ్యాలముక్కులోని ప్రశాంత్ అనే ఇంట్లో నిజిల్ దాస్ తలదాచుకున్నట్లు సమాచారం.
ఈ కేసుకు సంబంధించి ప్రశాంత్ భార్య, ఉపాధ్యాయురాలు రేష్మను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్ స్థానికంగా సీపీఎం కార్యకర్తగా గుర్తింపు పొందాడు. శుక్రవారం ఉదయం ప్రశాంత్ ఇంటి నుంచి నిజిల్ దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూమహీ ఎస్‌ఐలు విపిన్, అనిల్‌కుమార్ నేతృత్వంలోని బృందం ఆ ఇంటిపై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న సీపీఎం కార్యకర్త పున్నోల్ హరిదాస్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిజిల్‌ను తొలుత విచారించి విడుదల చేశారు, అయితే తదుపరి విచారణలో నిజిల్ పాత్ర స్పష్టంగా ఉన్నట్లు పోలీసులు గుర్తంచారు. అయితే తనను పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్న భయంతో..నిజిల్ దాస్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కోర్టు దానిని తిరస్కరించింది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala, Murder case