హనుమాన్ చాలీసా సాకుతో వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే అయిన రవి రాణాలపై ముంబై పోలీసులు దేశద్రోహం కేసు మోపారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
మహారాష్ట్రలో అధికార శివసేనకు, బీజేపీకి అనుబంధంగా వ్యవహరిస్తోన్న నవనీత్ రాణా దంపతులకు మధ్య తలెత్తిన హనుమాన్ చాలీసా వివాదం న్యాయస్థానానికి చేరింది. వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే అయిన రవి రాణాలపై ముంబై పోలీసులు దేశద్రోహం కేసు మోపారు. నవనీత్ రాణా దంపతులకు 14 రోజుల పాటు, అంటే, మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సన్డే కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే రాణా దంపతులను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ దంపతులు హల్ చల్ చేయడం, ఆ తర్వాత విరమించుకుకోవడం తెలిసిందే.
బీజేపీ ప్రోద్బలంలో నవనీత్ రాణా దంపతులు వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ శివసేన నేతలు ఆరోపించారు. దీంతో పోలీసులు ఈ దంపతులను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అండ్ సన్డే కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించగా, ఏప్రిల్ 29 న వీరిద్దరి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది.
హనుమాన్ చాలీసా పఠనానికి ప్రయత్నించిన నవనీత్ దంపతులపై ఏకంగా దేశద్రోహ అభియోగం మోపడాన్ని వారిద్దరి తరపు న్యాయవాది తప్పుబట్టారు. హనుమాన్ చాలీసా పఠించడం 153 (ఏ) కింది రాదని, ఇదో బోగస్ కేసు అని మండిపడ్డారు. వీరు బెయిల్పై వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టే పోలీసులు రెండో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని న్యాయవాది ఆరోపించారు.
జ్యూడీషియల్ రిమాండ్ విధించిన తర్వాత నవనీత్ రాణా అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి అనూహ్య పోస్టులు వెలువడ్డాయి. ‘హనుమాన్ చాలీసా చదవడం పాపమా? అయితే ఆర్టికల్ 370 (A) ప్రకారం మాకు జీవిత ఖైదు విధించండి. హనుమాన్ చాలీసా చదవడం నేరమా? అన్నది దేశ ప్రజలకు మా ప్రశ్న. సమాధానం అవునైతే మమ్మల్ని ఉరితీయండి..’అని నవనీత్ వాదనగా వ్యాఖ్యలు ఆ పోస్టులో రాసున్నాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.