GWALIOR POLICE SEIZES HUGE AMOUNT OF GANJA WORTH ONE CRORE RUPEES RECOVERED FROM BANANA CARRYING TRUCK FROM AP SK
పుష్పను మించిపోయారు.. అరటి పళ్ల లారీలో కోటి రూపాయల గంజాయి.. ఏపీ నుంచి యూపీకి..
ఈ లారీలోనే గంజాయి స్మగ్లింగ్
Ganja Smuggling: ఏపీలోని రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా యూపీకి గంజాయిని తరలిస్తున్నట్లుగా గ్వాలియర్ పోలీసులు వెల్లడించారు. కోటి రూపాయల విలువైన 9 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గత ఏడాది విడుదలైన పుష్ప సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించిన విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ అల్లు అర్జున్ మూవీ సూపర్ హిట్ టాక్‌తో నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఐతే పుష్ప సినిమాలో మిల్క్ వ్యాన్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్టుగానే.. ఇప్పుడు నిజ జీవితంలోనూ స్మగ్లింగ్ కేసులు తెరపైకి వస్తున్నాయి. వాటర్ ట్యాంకుల్లో ఎర్రచందనం, అంబులెన్స్‌లో గంజాయి తరలింపు వంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అరటిపళ్ల లారీలో గంజాయి తరలిస్తున్న ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గ్వాలియర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. ఏపీ నుంచి యూపీకి తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరటి పళ్ల మధ్య గంజాయి బస్తాలను ఉంచి.. లారీలో తరలిస్తుండగాా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు సుమారు 9 క్వింటాళ్ల గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా. గంజాయి తీసుకెళ్తున్న ముగ్గురు స్మగ్లర్లను కూడా పోలీసులు పట్టుకున్నారు. అయితే ముఠా సూత్రధారి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసుల బృందం రంగంలోకి దిగింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు భారీగా గంజాయి సరఫరా అవుతున్నట్లు గ్వాలియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందింది. వెంటనే గ్వాలియర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసలు రంగంలోకి దిగారు. ఝాన్సీ రోడ్లో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. ఇన్ఫార్మర్ చెప్పినట్లుగానే.. ఆంధ్ర ప్రదేశ్ నెంబర్ ప్లేట్ ఉన్న ఓ అరటి పళ్ల ట్రక్ వచ్చింది. అందులో ఏమున్నాయని అడిగితే.. అరటి పళ్లు తప్ప ఇంకేం లేవు సార్.. అని ట్రక్కు డ్రైవర్ చెప్పాడు. కానీ అందులో గంజాయి ఉన్నట్లు పోలీసులకు పక్కాగా సమాచారం ఉంది. అందుకే లారీ మొత్తాన్ని తనిఖీ చేశారు. అరటి పళ్ల మధ్య ఉన్న గంజాయి సంచులను చూసి షాక్ తిన్నారు. అరటిపళ్ల మధ్య ఉన్న బస్తాల్లో సుమారు 9 క్వింటాళ్ల గంజాయి లభ్యమైంది.
ఏపీలోని రాజమండ్రి నుంచి యూపీకి గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఏపీ నుంచి యూపీకి అరటి పండ్లు తరలిస్తున్నామని.. ట్రక్కులో మొత్తం 25 క్వింటాళ్ల అరటి పళ్లు ఉన్నాయని నిందితులు పోలీసులకు బిల్లులు చూపించారు. కానీ ఆ ట్రక్కులో 15 క్వింటాళ్ల అరటి పళ్లు మాత్రమే ఉన్నాయి. మిగతా 9 క్వింటాళ్ల గంజాయిని సంచుల్లో ప్యాక్ చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా అరటి పళ్ల మధ్యన ఉంచారు. గంజాయి వాసన రాకుండా ఉండేందుకు ఆ బస్తాలపై పర్ఫ్యూమ్ని చల్లారు. సాధారణ తనిఖీలు చేస్తే.. వాటిని గుర్తుపట్టడం కష్టమే. కానీ ఇన్ఫార్మర్ ద్వారా ఖచ్చితమైన సమాచారం అందడంతోనే పోలీసులు రంగంలోకి దిగి స్మగ్లర్లను పట్టుకున్నారు. ఈ ముఠా వెనక ఎవరున్నారు? యూపీలో ఎవరికి వద్దకు తరలిస్తున్నారన్న వివరాలను కూపీ లాగుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.