గ్వాలియర్: ఆ యువకుడి తండ్రి ఒక రైతు. కొడుకును పోలీసుగా చూడాలన్నది ఆయన కోరిక. కొడుకు కూడా తన తండ్రి కోరుకున్నట్టుగానే పోలీస్ అయ్యేందుకు కష్టపడ్డాడు. అతను పడిన కష్టానికి కానిస్టేబుల్ ఉద్యోగం దక్కింది. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆ యువకుడికి ఆరు నెలల క్రితం గుణవతి, రూపవతి అయిన ఓ యువతితో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. విధికి ఆ కొత్త జంటను చూసి కన్నుకుట్టిందో ఏమో ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవకుండానే ఆ యువకుడు ఆమెను వదిలి శాశ్వతంగా వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పరిధిలో వెలుగుచూసింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. దేవేంద్ర అనే యువకుడు గ్వాలియర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఆరు నెలల క్రితం వైశాలి అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. దేవేంద్ర కుటుంబంతో సహా షాజాపూర్‌లో ఉండేవారు. దేవేంద్రకు నీరజ్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఇద్దరూ ఎన్నో సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ ఇద్దరి స్నేహం కారణంగా కుటుంబాలు కూడా కలిసిమెలిసి ఉండేవి. నీరజ్‌కు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు.
ఇటీవల.. నీరజ్, దేవేంద్ర భార్యాపిల్లలతో కలిసి గ్వాలియర్‌కు కారులో వెళుతున్నారు. కారులో దేవేంద్ర భార్య వైశాలి(24), నీరజ్ భార్య అల్క, కొడుకు అన్మోల్(3), కూతురు ప్రియాన్షి(11) ఉన్నారు. నీరజ్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. నీరజ్ పక్కనే దేవేంద్ర కూర్చున్నాడు. కారు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో గుణలోని బెర్ఖేడి ప్రాంతానికి దగ్గరలో ఉన్న బీనాగంజ్ ప్రాంతానికి రాగానే నీరజ్ పొరపాటున నిద్ర మత్తు ఆపుకోలేక రెప్ప వాల్చాడు.
అంతే క్షణ కాలంలో ఘోరం జరిగిపోయింది. నీరజ్ కళ్లు మూసి తెరిచే లోపే కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ తర్వాత కల్వర్టు మీదకు పడిపోయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ దేవేంద్ర, నీరజ్ భార్య అల్క, కూతురు ప్రియాన్షి స్పాట్‌లోనే చనిపోయారు. నీరజ్, నీరజ్ కొడుకు అన్మోల్, దేవేంద్ర భార్య వైశాలి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం గ్వాలియర్‌కు తరలించారు.
విషాదం ఏంటంటే.. దేవేంద్ర క్షేమంగా ఉండాలని ఈ ప్రమాదం జరిగిన ముందు రోజే అతని భార్య వైశాలి పూజ చేసి ఉపవాసం ఉంది. భార్యాభర్తలిద్దరూ కలిసి సెల్ఫీ కూడా దిగారు. కానీ.. తన భార్యతో అదే చివరి సెల్ఫీ అవుతుందని దేవేంద్ర కలలో కూడా అనుకోలేదు. ఈ ఘటన దేవేంద్ర, నీరజ్ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. దేవేంద్ర మరో స్నేహితుడు అభిషేక్ కూడా గ్వాలియర్‌లోనే ఉంటున్నాడు. ఈ ఘటన జరిగే ముందు రోజే అభిషేక్ బర్త్ డే. అతనికి ఫోన్ చేసి దేవేంద్ర విషెస్ కూడా చెప్పాడు. రేపు గ్వాలియర్‌కు వస్తున్నామని.. కలుద్దామని కూడా చెప్పాడు. దేవేంద్ర కోసం ఎదురుచూస్తున్న అతని స్నేహితుడు అభిషేక్ దేవేంద్ర మరణ వార్త విని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Car accident, Crime news, Madhya pradesh, Road accident