దంపతులుగా కలిసి బతకాలనే కోరికతో ఇద్దరు స్కూల్ విద్యార్థులు లేచిపోయారు. ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరాలో చోటుచేసుకుంది. వివరాలు.. వడోదరాలోని చని ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా స్కూల్స్ మూతపడటంతో గతేడాది మార్చి నుంచి వారు కలుసుకోవడాని వీలు పడలేదు. ఈ క్రమంలోనే తమ ప్రేమను మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. స్వతంత్రంగా కలిసి బతికేందుకు వారి ఇళ్లలో నుంచి పారిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. ప్లాన్ ప్రకారం వారు డిసెంబర్ 28 వారి వారి ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో బాలుడు తన ఇంట్లో నుంచి రూ. 25 వేలు తీసుకొచ్చాడు. బాలిక కూడా రూ. 5 వేలు తన వెంట తీసుకువచ్చింది.
అనంతరం ఇద్దరు కలిసి రానోలి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అయితే వారికి రైలు మిస్సయింది. దీంతో వారు అక్కడి నుంచి సయాజిగంజ్కు వెళ్లారు. అక్కడి నుంచి టాక్సీలో వాపికి చేరుకున్నారు. గతంలో తన ఫ్యామిలీతో కలిసి వాపి వచ్చిన బాలుడికి ఆ ప్రాంతం గురించి మంచి అవగాహన ఉంది. వాపీలోనే వారు నెలకు రూ. 500కు ఓ గది అద్దెకు తీసుకున్నారు. అక్కడే తమ ఖర్చుల కోసం.. బాలుడు ఓ వస్త్ర దుకాణంలో పనికి చేరాడు. అక్కడ రోజుకు అతనికి 366 రూపాయలు ఇచ్చేవారు.
మరోవైపు బాలుడు, బాలిక కనిపించకపోయేసరికి వాళ్ల ఆచూకీ కోసం వారి వారి తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో చని పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక, బాలుడు కొద్ది రోజుల క్రితం తన స్నేహితుడు ఒకరితో కాంటాక్ట్‌లోకి వచ్చాడు. దీంతో పోలీసులకు బాలుడి గురించి తెలిసింది. అనంతరం సాంకేతిక నిఘా ఉపయోగించి పోలీసులు ఆ బాలుడు, బాలికలను వడోదరాకు తీసుకువచ్చారు.
అయితే పోలీసుల విచారణ సందర్బంగా తామిద్దరం శారీరక సంబంధం కలిగి ఉన్నామని బాలిక తెలిపింది. దీంతో పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపించారు. బాలుడిని క్వారంటైన్ చేశారు.
Published by:Sumanth Kanukula
First published:January 12, 2021, 07:20 IST