ప్రపంచంలో ఏ మహిళకూ రాకూడని కష్టం ఆమెది. పొద్దు కంటే ముందే నిద్ర లేచి ఇంటి పనులన్నీ చకచకా పూర్తి చేసి, వృద్దులైన అత్తమామలకు అన్నీ సమకూర్చి, ఆఫీసుకు వెళ్లేలోపే భర్తకు కావాల్సిన అన్నిటినీ సిద్దం చేసి.. ఈలోపే పాప లేస్తే ఆమెకు పాలు పట్టి.. భర్త వెళ్లిపోయాక అంట్లు తోమి, బట్టలు ఉతికి, స్నానం తర్వాత మళ్లీ వంట చేసి, అత్తమామలకు వడ్డించి, తాను తిన్న తర్వాత.. పాపను పక్కలో వేసుకుని చిన్న కునుకు తీస్తుంది. అదిగో అదే ఆమె చేసిన నేరం. పగటి పూట ఇంట్లో నిద్రపోవడమేంటంటూ అత్తమామలు ఆమెను ఆక్షేపించారు. భర్త కూడా వాళ్లనే సమర్థించి.. మధ్యాహ్నం పడుకోవద్దని భార్యకు హుకుం జారీ చేశాడు. కానీ పాపం.. అలసటతో ఆమె నిద్రపోవడం మానుకోలేకపోయింది. ఎన్నిసార్లు చెప్పినా పగటి పూట పడుకుంటోందనే ఆక్రోషంతో అత్తమామలు ఆమెను చితకబాదారు. ఒకటీ రెండూ కాదు కోన్ని నెలలపాటు ఆమెనలా హింసించారు. చివరికి ఆ టార్చర్ భరించలేక పోలీసులను ఆశ్రయించిందా బాధితురాలు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ సిటీలో చోటుచేసుకుందీ ఉదంతం. వివరాలివి..
బాధిత మహిళకు 2016లో మెహ్సానా జిల్లా కాదీకి చెందిన వ్యక్తితో వివాహం అయింది. పెళ్లి తర్వాత అతను ఉద్యోగం చేసే అహ్మదాబాద్ సిటీకి షిఫ్ట్ అయ్యారు. వృద్దులైన అత్తమామలు కూడా వాళ్లతోనే కలిసుంటున్నారు. పెళ్లయిన తర్వాతి రోజు నుంచి అత్తారింట్లో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. పగటి పూట పడుకోడానికి వీల్లేదని కఠిన ఆంక్షలు విధించారు. అయితే ఇంటి పనులన్నీ ఒక్కతే చేసుకుని బడలికతో మధ్యాహ్నం పూట చిన్న కునుకు తీస్తే.. వెంటనే అత్తమామల్లో ఒకరు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను నిద్రలేపేవాళ్లు. కొడుకు ఇంటికి రాగానే.. ‘ఒరేయ్.. నీ పెళ్లాం ఇవాళ కూడా నిద్రపోయిందిరా..’అని పితుర్లు చెప్పేవారు. ఈ కష్టాల సుడిగుండంలోనే సంసారం చేస్తూ 2017లో ఓ పాపకు జన్మనిచ్చిందా మహిళ..
బిడ్డ పుట్టిన తర్వాత ఆమె కష్టాలు మరింత పెరిగాయి. పాపను కొద్దిసేపైనా ఎత్తుకోడానికి అత్తమామలు నిరాకరించేవాళ్లు. ఎందుకంటే వాళ్లకు మనవరాలంటే అసలే ఇష్టం లేదు. మగ పిల్లాడనిని కనివ్వలేదే అంటూ నిత్యం కోడలిని నిందిచేవాళ్లు. ఈ మాటలకు తోడు మధ్యాహ్నం నిద్రపోనివ్వకపోవడం ఎలాగూ ఉండేదే. బిడ్డ పుట్టిన తర్వాత పని పెరగడంతో అలసట ఎక్కువై మధ్యాహ్నం నిద్రపోతోంటే కొట్టడం మొదలుపెట్టారు అత్తామామలు. గడిచిన రెండేళ్లుగా అత్తమామలతోపాటు భర్త కూడా ఆమెను పలు మార్లు కొట్టారు. వేధింపులు తట్టుకోలేక గతంలోనూ
మధ్యాహ్నం నిద్రపోనీయకుండా కొడుతున్నారంటూ భర్త, అత్తమామలపై గతంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పుడు కుల పెద్దలు జోక్యం చేసుకుని పంచాయితీ చేసి మళ్లీ కాపురానిని పంపారు. పోలీసులకు ఫిర్యాదు తర్వాత ఆమె కష్టాలు మూడింతలయ్యాయి. ఒక దశలో దెబ్బలు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయిందా మహిళ. ఇదే అవకాశంగా ఆమెను వదిలించుకుని కొడుక్కి వేరే పెళ్లి చేస్తామని అత్తమామలు బెదిరింపులకు దిగారు. దీంతో తాజాగా మరోసారి పోలీసులను ఆశ్రయించిందా బాధిత మహిళ. వేధింపుల కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.