ఫిబ్రవరి 16న కర్ణాటక.. బెంగళూరు... మహదేవపురలోని టెక్ కారిడార్‌లో జరిగిందో విచిత్ర ఘటన. వధువు, వరుడు కారులో వెళ్తుండగా.. ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతే.. కారులోంచీ దిగిన వరుడు పరుగు మొదలుపెట్టాడు. అది చూసిన వధువు ఆశ్చర్యపోయింది. వాహనాల మధ్య నుంచి అతను పారిపోతుంటే.. అతన్ని పిలుస్తూ ఆమె కూడా పరుగులు పెట్టింది. దాంతో.. మిగతా వాహనదారులంతా.. ఏమైంది.. ఇక్కడేదైనా సినిమా షూటింగ్ జరుగుతోందా అని ఆశ్చర్యంగా చూశారు. ఒలింపిక్స్‌లో రన్నింగ్ చేసినట్లుగా.. వరుడు వేగంగా పారిపోయాడు. దాంతో.. అతన్ని పట్టుకోవడం వధువు వల్ల కాలేదు. అలా.. బెంగళూరు ట్రాఫిక్ జామ్.. అతను పారిపోవడానికి వీలు కల్పించింది.
వాళ్లిద్దరికీ ముందు రోజే పెళ్లైంది. మర్నాడే పారిపోయాడు. అతని కోసం వధువు తరపు వారు ఎక్కడెక్కడో వెతికారు అయినా దొరకలేదు. "వరుడు గోవాలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. ఆ మహిళ.. వరుడిని బ్లాక్ మెయిల్ చేసింది. బెంగళూరులో పెళ్లి చేసుకుంటే... తమ ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని ఆమె బ్లాక్ మెయిల్ చెయ్యడం వల్లే వరుడు పారిపోయాడు" అని వధువు... మార్చి 5న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
ఇప్పుడు బెంగళూరు పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. అతను.. చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని చింతామణికి చెందిన వాడు. తాను, తన ఫ్యామిలీ.. వరుడికి అండగా ఉంటుందన్న 22 ఏళ్ల వధువు.. అతను ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులకు తెలిపింది. పోలీసులు అతని కోసం 4 రోజులుగా వెతుకుతున్నా.. ఆచూకీ తెలియలేదు.
ఫిబ్రవరి 15న పెళ్లి తర్వాత.. ఓ చర్చికి వెళ్లి.. వధూవరులు కారులో వస్తుండగా.. పై లేఅవుట్ దగ్గర కారు 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. ఆ టైంలో ఫ్రంట్ సీటులో కూర్చున్న వరుడు డోర్ తీసి పారిపోయాడు. వధువు తండ్రి... కర్ణాటక , గోవాలో.. ఓ మేన్‌పవర్ ఏజెన్సీ నడుపుతున్నాడు. అందుకు వరుడు సాయంగా నిలిచాడు. ఐతే.. గోవాలో కంపెనీ డ్రైవర్లలో ఒక వ్యక్తి భార్యతో వరుడు వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఆమె కూడా అదే కంపెనీలో క్లర్క్‌గా పనిచేస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న వరుడి తల్లి అతన్ని నిలదీసింది. దాంతో.. ఆమెతో సంబంధాన్ని ఆపేస్తానని మాట ఇచ్చాడు కానీ నిలబెట్టుకోలేదు. ఎలాగైనా తన కొడుకును ఈ వివాహేతర సంబంధం నుంచి బయటపడేయాలనుకున్న తల్లి.. ఈ పెళ్లి చేసింది. ఈ విషయాన్ని పెళ్లికి ముందే వధువుకి చెప్పింది. పెళ్లి తర్వాత వివాహేతర సంబంధం ఆపేస్తానని వరుడు వధువుకి మాట ఇచ్చాడు. కానీ భయంతో పారిపోయాడు. అతనికి ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం కూడా ఉన్నట్లు అనుమానం ఉందన్న వధువు.. అతను క్షేమంగా తిరిగొస్తాడని ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangalore, Crime news