news18-telugu
Updated: June 15, 2020, 9:15 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఈత సరదా నలుగురి ప్రాణాలను బలిగొంది. ఆంధ్రప్రదేశ్లో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో సెల్పీ దిగుతూ జలపాతంలో జారిపడి మరో వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ రెండు ఘటనల్లో సరదా కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన పులి సంతోష్(11), తెంపల్లి మహేశ్(11), షేక్ నాగుల్ మీరా(11) ముగ్గురు కలిసి సమీపంలోని ఓ వాగులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. అక్కడి వాగులోకి ముగ్గురు ఒకేసారి దూకారు. అయితే వాగులో పూడికతీత కోసం తీసిన లోతైన గుంతలో పడి కూరుకుపోయారు. నీటిలో మునిగి బయటకు రాలేకపోయారు. అనంతరం మహేశ్ తండ్రి తెంపల్లి చిన అంకురాజు ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చాడు.
ఆ తర్వాత పశువులను మేపేందుకు వాగు వద్దకు వెళ్లాడు. అక్కడ తన కొడుకు దుస్తులు కన్పించడంతో సమీప ప్రాంతాలంతా వెతికాడు. ఎక్కడా కన్పించకపోవడంతో అనుమానం వచ్చి వాగులోకి దిగి చూశాడు. ఆ గుంతలో పడిన ముగ్గురు బాలురు కన్పించారు. స్థానికుల సాయంతో గుంతలో నుంచి ముగ్గురిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మరో ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
గోదావరిఖనికి చెందిన నలుగురు యువకులు మంచిర్యాలలోని సబ్బితం జలపాతం వద్దకు సరదా కోసం వచ్చారు. ఈ క్రమంలో డిప్లొమా విద్యార్థి ఆలే యశ్వంత్(22) సెల్పీ దిగుతూ పైనుంచి జారి జలపాతంలో పడిపోయాడు. నీటి మునిగి ప్రాణాలు వదిలాడు.ఈ రెండు వేర్వురు ఘటనలతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Published by:
Narsimha Badhini
First published:
June 15, 2020, 9:15 PM IST