పంజాబ్ ఉగ్ర దాడి నిందితుల వివరాలు ఇస్తే 50 లక్షల నజరానా

పంజాబ్‌లో గ్రనేడ్ దాడి మరోసారి ఉగ్రవాద భయాల్ని కలిగిస్తోంది. పాకిస్థాన్ నుంచీ వచ్చిన ఉగ్రవాదులే పేలుడుకు పాల్పడి ఉంటారన్న నిఘావర్గాల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు సాగిస్తున్నాయి.

news18-telugu
Updated: November 19, 2018, 2:31 PM IST
పంజాబ్ ఉగ్ర దాడి నిందితుల వివరాలు ఇస్తే 50 లక్షల నజరానా
పేలుడులో గాయపడ్డ వ్యక్తి
  • Share this:
పంజాబ్‌, అమృత్‌సర్ పరిధిలోని సజ్సానీ గ్రామంలో జరిగిన గ్రనేడ్ పేలుడుకు పాల్పడిన వారి వివరాలు ఇస్తే 50 లక్షల నజరానా ఇస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఎవరైనా సరే, పంజాబ్ పోలీస్ హెల్ప్‌లైన్ 181కి కాల్ చేసి వివరాలు ఇవ్వొచ్చన్నారు. సమాచారం అందించిన వారి పేర్లను రహస్యంగా ఉంచుతామన్నారు. ఇవాళ ఆయన ఘటనా స్థలానికి వెళ్లి, పరిశీలించనున్నారు. ఇంతకుముందు ఎన్ఐఏ బృందాలు ఆదివారం రాత్రి పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లి, పరిశీలించాయి. వారితోపాటూ బాంబు స్క్వాడ్ బృందాలు కూడా వెళ్లాయి. పంజాబ్ పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులతో ఎన్ఐఏ అధికారులు ఈ ఘటనపై చర్చించారు. ఇదో ఉగ్రవాద దాడిగా భావిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో నిరంకారీ భవన్‌పై గ్రనేడ్ దాడికి దిగిన ఇద్దరు అనుమానితుల దృశ్యాలు రికార్డయ్యాయి. ఇద్దరు వ్యక్తులు ముఖానికి కర్చీఫ్ కప్పుకుని బైక్‌పై వస్తూ కనిపించారు. వారిలో ఒక వ్యక్తి జీన్స్, షర్ట్ వేసుకుని ఉండగా, మరొకడు కుర్తా-పైజమా ధరించాడు. వీళ్లిద్దరూ వస్తున్న బ్లాక్ పల్సర్‌కి నంబర్ ప్లేట్ లేనట్టు తెలుస్తోంది. ఈ దుశ్చర్యలో ముగ్గురు చనిపోగా, 20 మంది గాయపడ్డారు. వారిని స్థానిక గురునానక్‌దేవ్ హాస్పిటల్, ఈవీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఘటనపై అమరీందర్‌తో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కారకులు ఎంతటి వారైనా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

గ్రనేడ్ దాడిలో అనుమానితులు
గ్రనేడ్ దాడిలో అనుమానితులు


గ్రనేడ్ దాడి జరిగిన ప్రాంతం అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లోనే ఉంది. ఆదివారం పెద్దఎత్తున భక్తులు అద్లివాల్‌లోని నిరంకారీ భవన్‌కు చేరుకున్నారు. సుమారు 200మంది ప్రార్థనల్లో మునిగిఉండగా, మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు, గేటు దగ్గర విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా గార్డును రివాల్వర్‌తో బెదిరించి, నిరంకారీ భవన్ మెయిన్ గేట్‌లోకి ప్రవేశించారు. లోపల ప్రార్థనల్లో ఉన్న భక్తసమూహంపైకి గ్రనేడ్‌ విసిరి పారిపోయారు.

పంజాబ్‌లో టెన్షన్, టెన్షన్
పంజాబ్‌లో నిరంకారీలకు, సంప్రదాయ సిక్కులకూ మధ్య చాలా తేడాలున్నాయి. మానవుడే (బాబా) దేవుడని నిరంకారీలు నమ్ముతారు. సిక్కు మత పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహెబ్‌ను కూడా విశ్వసిస్తారు. సంప్రదాయ సిక్కులు మనిషిలో దైవాన్ని చూడరు. 1978లో సంప్రదాయ సిక్కులకు, నిరంకారీలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 18 మంది చనిపోయారు. 1980లో నిరంకారీల నేత గురుబచన్ సింగ్‌ను సంప్రదాయ సిక్కు అయిన రంజిత్ సింగ్ ఢిల్లీలో చంపేశారు. అప్పట్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా ప్రస్తుతం అందరూ ప్రశాంతంగా ఉంటున్నారు. తాజా గ్రనేడ్ దాడితో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం ఉంది. ఐతే, వారం కిందటే పంజాబ్‌లోకి ఉగ్రవాదులు వచ్చారని నిఘావర్గాలు చెప్పడంతో అనధికారిక హైఅలర్ట్ అమల్లో ఉంది.
Published by: Krishna Kumar N
First published: November 19, 2018, 12:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading