news18-telugu
Updated: October 7, 2020, 8:45 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ప్రేమించి పెళ్ళికి నిరాకరించిన యువకుడి ఇంటి ముందు నాలుగు రోజులపాటు దీక్ష చేపట్టి ఓ ప్రియురాలు చివరకు ప్రియుడిని పెళ్ళికి ఒప్పించింది. ఈ ఘటన మంచిరాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన యువతి లక్సెట్టిపేట మండల వెంకట్రావ్ పేటకు చెందిన అరుణుకుమార్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్ళికూడా చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత నిరాకరించడంతో ప్రియురాలు వెంకట్రావ్ పేట గ్రామంలోని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి మౌన పోరాటం చేసింది. మూడు రోజుల నుండి మౌనపోరాటం చేస్తున్న యువతికి న్యాయం చేస్తామని గ్రామస్థులు, పోలీసులు నచ్చజెప్పారు. అయితే ప్రియుడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ యువకుడి ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసే ప్రయత్నం చేయడంతో గ్రామస్థులు, పెద్దలు కల్పించుకొని వారించారు. బాధితురాలి బంధువులు కూడా గ్రామ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చివరకు గ్రామస్థులు, పెద్దలు స్థానిక ఆలయానికి యువకుడిని రప్పించి మాట్లాడి పెళ్ళికి ఒప్పించారు. అక్కడే ఆలయంలో ఇద్దరికి నిశ్ఛితార్థం కూడా జరిపించారు. త్వరలోనే పెళ్ళి కూడా జరిపిస్తామని హామి ఇవ్వడంతో ఈ ఆందోళన సద్దుమణిగింది.
ఈ ఏడాది ఆగస్టులో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ప్రియుడు నమ్మించి మోసగించాడంటూ నెల్లూరు జిల్లా కలిగిరిలో ఓ యువతి అతని ఇంటి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆ మహిళ కలిగిరికి చెందిన జగన్ మోహన్ అనే యువకుడితో మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే జగన్ మోహన్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. పుట్టింట్లో కట్నం తీసుకురావాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వారు విడివిడిగా ఉంటున్నారు. జగన్ మోహన్ వేరే పెళ్లి సంబంధాలు చూసుకుంటున్న విషయం తెలుసుకున్న ఆమె...కలిగిరిలోని అతని ఇంటి వద్దకు చేరుకుంది. జగన్ మోహన్ ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. జగన్ మోహన్ తనను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని మోసగించాడని బాధితురాలు ఆరోపించింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 7, 2020, 8:20 PM IST