కూకట్‌పల్లిలో దారుణం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురి మృతి

గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన ఘటన కేపీహెచ్‌బీ కాలనీలో చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం కర్ణాటక నుంచి నగరానికి వచ్చిన బిచ్చప్ప కుటుంబానికి ఇలా జరగడంతో మిగిలిన కుటుంబసభ్యుల ఆవేదనకు అంతే లేకుండాపోయింది.

news18-telugu
Updated: March 25, 2020, 1:04 PM IST
కూకట్‌పల్లిలో దారుణం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురి మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కలబుర్గి జిల్లా రాళ్లగణపురానికి చెందిన తల్వార్ బిచ్చప్ప హౌసింగ్ బోర్డు పరిధి ఎన్ఆర్ఎస్ఏ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్‌లో మూడు నెలలుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. బిచ్చప్ప భార్య, కొడుకుతో అదే అపార్ట్‌మెంట్‌లోని చిన్నగదిలో నివాసం ఉంటున్నాడు. కొడుకు మల్లికార్జున్ మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఈనెల 22న తెల్లవారుజామున ఛాయ్ చేసేందుకు బిచ్చప్ప గ్యాస్ స్టవ్ వెలిగించే క్రమంలో సిలిండర్ పేలింది.

పేలడు ధాటికి బిచ్చప్పతో పాటు ఆయన భార్య మాధవి, కొడుకు మల్లికార్జున్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 23 రాత్రి మాధవి(50), మల్లకార్జున్(25), 24వ తేదీ ఉదయం బిచ్చప్ప(65) మరణించారు. ఇదిలావుంటే.. బిచ్చప్ప, మాధవి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, రెండో కుమార్తె గుల్బర్గాలో ఉంటోంది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో మిగిలిన కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతే లేకుండాపోయింది.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు