OMG: నయీమ్ ఆస్తుల విలువ రూ. 1200 కోట్లు... లెక్క తేల్చిన ఐటీ

పోలీసు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తుల లెక్కను ఐటీ శాఖ కొలిక్కి తీసుకొచ్చింది. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నయీమ్ ఆస్తుల విలువ రూ. 1200 కోట్ల ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ తేల్చింది.

news18-telugu
Updated: January 4, 2019, 7:45 PM IST
OMG: నయీమ్ ఆస్తుల విలువ రూ. 1200 కోట్లు... లెక్క తేల్చిన ఐటీ
గ్యాంగ్‌స్టర్ నయీమ్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన విచారణను ఐటీ శాఖ పూర్తి చేసింది. నయీమ్ ఆస్తులన్నీ బినామీలపై ఉన్నట్టు నిర్ధారించింది. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నయీమ్ ఆస్తుల విలువ రూ. 1200 కోట్ల ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ తేల్చింది. బినామీ ప్రాపర్టీస్ ప్రొబిషనరీ యూనిట్ కింద ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధం చేసింది. ఎజ్యుటికేటింగ్ అథారిటీలో బినామీ ప్రాపర్టీ కింద అటాచ్ వేయాలని ఐటీ శాఖ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఇక నయీమ్ ఆస్తుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇప్పటికే కేసు నమోదు చేసింది.

దశాబ్దానికి పైగా సెటిల్‌మెంట్లు, హత్యలతో తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకున్న గ్యాంగ్‌స్టర్ నయీమ్... 2016లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. నయీమ్ చనిపోయిన తరువాత అతడి స్థావరాలు, అనుచరుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి. నయీమ్ ఆస్తులను బాధితులను బెదిరించి లాక్కున్నవే అని పోలీసుల విచారణలో తేలింది. నయీమ్‌తో అంటకాగిన పోలీసులు, రాజకీయ నేతల గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ కేసు దర్యాప్తు కోసం అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇక నయీమ్, అతడి అనుచరుల ఇళ్లలో జరిపిన సోదాల్లో లభించిన నగదు, ఆస్తులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి వీటి లెక్కగట్టే పనిలో నిమగ్నమైన ఐటీశాఖ... చివరకు వీటి విలువ రూ. 1, 200 కోట్లుగా తేల్చింది.

బాధితులకు న్యాయం జరిగేనా ?
నయీమ్ బినామీ ఆస్తుల లెక్క తేలడంతో... అతడి బాధితులకు న్యాయం జరుగుతుందా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పటికే నయీమ్ కారణంగా ఆస్తులు కోల్పోయిన వారంతా బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్నారు. అయితే చట్టప్రకారం నయీమ్, అతడి బినామీ పేరు మీద ఆస్తులను బాధితులకు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా ఐటీ శాఖ నయీమ్ ఆస్తుల లెక్క తేల్చడంతో... బాధితులు మరోసారి తమ గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.




First published: January 4, 2019, 7:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading