2020.. మరో కొద్దిగంటల్లో ఈ ఏడాది ముగియనుంది. ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ప్రతిక్షణం మాయదారి మహమ్మారి కరోనానే ఆక్రమించింది. అయితే కరోనా నే గాక.. ఈ ఏడాది భారత్ లో కొన్ని అత్యంత కీలక ఘటనలు కూడా జరిగాయి. అందులో కొన్ని ఎన్కౌంటర్లు, అత్యాచారాలు, మాధక ద్రవ్యాల కుంభకోణం వంటివి భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. దాదాపు ప్రతి నెల ఏదో ఒక కీలకమైన క్రైమ్ జరిగితే.. అవి చర్చనీయాంశమయ్యాయి. అందులో వికాస్ దూబే ఎన్కౌంటర్, హత్రాస్ గ్యాంగ్ రేప్, డ్రగ్స్ కేసు వంటివి ముఖ్యమైనవి. వీటి గురించి కూలంకశంగా ఇక్కడ చూద్దాం...
వికాస్ దూబే ఎన్కౌంటర్ (Vikas dube Encounter)
ఉత్తరప్రదేశ్ లో పేరు మోసిన గ్యాంగ్ స్టర్ గా పేరున్న వికాస్ దూబే ఎన్కౌంటర్ ఈ ఏడాది చర్చనీయాంశమైంది. జూన్ లో ఈ గ్యాంగ్ స్టర్ తన ఊరిలోని ఒక ఇంట్లో తలదాచుకున్నాడన్న సమాచారంతో పోలీసులు అతడిని పట్టుకోవడానికి వెళ్లగా.. అక్కడ వారిపైనే కాల్పులు జరిపింది వికాస్ దూబే గ్యాంగ్. ఆ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు చనిపోయారు. తర్వాత ఈ ఉదంతాన్ని సవాల్ గా తీసుకున్న యూపీ పోలీసులు.. దూబే కోసం వేట మమ్మురం చేశారు. అయితే యూపీ నుంచి పారిపోయిన దూబే.. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ప్రత్యక్షమయ్యాడు. దీంతో అతడిని అక్కడే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. యూపీ సరిహద్దులు దాటగానే ఎన్కౌంటర్ చేశారు.

వికాస్ దుబే
హత్రాస్ గ్యాంగ్ రేప్ (hatras gang rape)
దేశాన్ని నిర్భయ తర్వాత అంతలా కదిలించిన ఘటన ఇది. యూపీలోని హత్రాస్ జిల్లాలో ఒక దళిత యువతిపై నలుగురు అగ్రవర్ణాలకు చెందిన కామాంధులు.. సామూహిక అత్యాచారం చేయడమే గాక.. ఆమెపై అత్యంత అమానవీయంగా దాడికి పాల్పడి.. ఆ యువతి మరణానికి కారకులయ్యారు. బాధితురాలు మరణం తర్వాత యూపీ సర్కారు, పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రతీకాత్మక చిత్రం
పాల్ఘర్ మూక దాడి (palghar mob lynching)
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రసారం చేయడం వల్ల జరిగిన అత్యంత దారుణ ఘటన ఇది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఇద్దరు సాధువులతో పాటు.. ఒక కార్ డ్రైవర్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. పిల్లల్ని ఎత్తుకుపోయే వారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ఒక గ్రామానికి చెందినవారంతా.. ఆ ముగ్గురిపై దాడికి పాల్పడి.. వారిని కొట్టి చంపారు.
ట్యూటికోరిన్ కస్టోడియల్ మరణాలు
తమిళనాడులోని ట్యూటికోరిన్ లో జరిగిన కస్టడీ మరణాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కస్టడీలో ఉన్న తండ్రీ కొడుకులు పి.జయరాజ్, బెన్నిక్స్.. ఇద్దరూ పోలీసుల కస్టడీలో చనిపోయారు.వారిద్దరి బట్టలు రక్తంతో తడిసి ఉండటంతో వీరి మరణంపై అనుమానాలు రేకెత్తాయి. మానవహక్కుల సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.
బాలీవుడ్, శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు..

రియా చక్రవర్తి (Twitter/rhea chakraborty)
ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీని గురించే. బాలీవుడ్ హీరో దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత.. ఈ అగ్గి రాజుకుంది. ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి దగ్గర తీగ లాగితే బాలీవుడ్ డొంకంతా కదిలింది. సుమారు ఐదు నెలల పాటు ఈ చర్చ నడిచింది. ఈ కేసులో రియాతో పాటు బాలీవుడ్ నటీమణులు సారా అలీఖాన్, దీపికా పదుకునే, శ్రద్దా కపూర్ వంటి పలువురు నటీమణులు కూడా విచారణ ఎదుర్కొన్నారు. రియా చక్రవర్తితో పాటు.. అతడి తమ్ముడు జైలుకు కూడా వెళ్లారు. రియా బెయిల్ పై బయటకు రాగా.. ఆమె సోదరుడు జైళ్లోనే ఉన్నాడు. బాలీవుడ్ తో పాటు కన్నడ నాట కూడా డ్రగ్స్ కేసు సంచలనం రేపిన విషయం విదితమే.