news18-telugu
Updated: July 18, 2020, 8:51 AM IST
ప్రతీకాత్మక చిత్రం
వారిద్దరూ స్నేహితులు. ఏ విషయంలోనైనా ఒకరికొకరు తోడుగా ఉండేవారు. కానీ వారి మధ్య వివాహేతర సంబంధమనే అనుమానం పెను విషాదాన్ని మిగిల్చింది. తన వదినతోనే విహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడిని తన స్నేహితుడే కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కడ్తాల్ మండల పరిధిలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కిరణ్(28) ప్రైవేటు డ్రైవర్. ఇదే గ్రామానికి చెందిన ఏదుల మహేశ్.. కిరణ్ స్నేహితులు. గురువారం రాత్రి సమయంలో ఏదుల మహేష్ తన స్నేహితుడు కిరణ్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచాడు. స్నేహితుడు పిలవడంతో కిరణ్ అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.
అయితే అప్పటికే తన వదినతో కిరణ్‌కు అక్రమ సంబంధం ఉందన్న అనుమానం మహేశ్‌లో ఉంది. ఈ క్రమంలోనే ఇంటికి వచ్చిన కిరణ్‌ను ఈ విషయమై మహేశ్ నిలదీశాడు. అదే సమయంలో మహేష్ సోదరుడు, వదిన సైతం వచ్చారు. చిన్నగా మొదలైన వాగ్వాదం కాస్త.. పెద్ద ఘర్షణగా మారింది. ఈ క్రమంలో మహేశ్, సోదరుడు శ్రీశైలం, వదిన రమాదేవితో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు కలిసి కిరణ్‌ను గొడ్డలితో తలపై బలంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే పక్కా ప్రణాళిక ప్రకారమే తన కొడుకు కిరణ్‌ను రాత్రి సమయంలో ఇంటికి పిలిపించుకుని కొట్టి చంపారని కిరణ్ తండ్రి కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించడంతో పాటు వివరాలు సేకరించారు. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరించారు.
Published by:
Narsimha Badhini
First published:
July 18, 2020, 8:51 AM IST