Fraud: నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ఉద్యోగి గుట్టు బట్టబయలైంది. మెట్ పల్లి తహసీల్దార్ డిజిటల్ సంతకంతో నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరుట్ల పట్టణానికి చెందిన పోగుల రాజేశ్ అనే ఉద్యోగిపై మెట్ పల్లి స్టేషన్లో కేసు నమోదు కావడంతో అక్రమ వ్యవహారం వెలుగు చూసింది .
రాజేశ్ ఈ - సేవ కేంద్రంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగి . అక్రమంగా డబ్బులు సంపాదించాలని నకిలీ ధ్రువపత్రాల తయారీపై దృష్టి సారించాడు. అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని జిల్లాతో సంబంధం లేకుండా ఇతర జిల్లాలో నివసిస్తున్న వారికి సైతం డిజిటల్ సంతకంతో ధ్రవీకరణ పత్రాలు తయారు చేసి విక్రయించాడని తెలుస్తోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ వ్యవహారంలో అక్కడ ఈ - సేవా కేంద్రంలో పని చేస్తున్న రాజేశ్ ను గతేడాది విధుల నుంచి తొలిగించారని సమాచారం. అధికారుల అండదండలతో మళ్లీ ఉద్యోగం సంపాదించి మెట్పల్లి కేంద్రానికి వచ్చాడు. ఇటీవల కోరుట్లకు బదిలీ అయ్యాడు. అక్కడ ఓ వ్యక్తి గత నెలలో తన కూతురు వివాహం కోసం కల్యాణలక్ష్మి పథకం డబ్బులకు దరఖాస్తు చేసుకున్నాడు . తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసినట్టు గుర్తించారు. కోరుట్ల తహసీల్దార్ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు నకిలీ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసిన తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణలో.. రాజేశ్ తయారు చేసిన నకిలీ పత్రాలన్నీ మెట్ పల్లి తహసీల్దార్ రాజేశ్ డిజిటల్ సంతకంతో జారీ అయ్యాయని వెల్లడైంది. దీంతో తహసీల్దార్ ఫిర్యాదు మేరకు మెట్పల్లి పోలీసులు మంగళవారం రాజేశ్ పై కేసు నమోదు చేశారు. ఒక్కో ధ్రువపత్రానికి రూ .5 నుంచి రూ .6 వేలకు పైగా వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. జన్మతేదీ , పాసుపోర్టులు , ఓటరు గుర్తింపు కార్డులు , పాన్ కార్డులు , బీడీ కార్మికుల పీఎఫ్ కార్డుల్లో మార్పులకు వీటిని వినియోగిస్తున్నారు.
జగిత్యాల జిల్లాతోపాటు పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురికి వీటిని విక్రయించాడని తెలుస్తోంది. పోలీసులు సమగ్ర విచారణ జరిపితే నకిలీ ధ్రువీకరణ పత్రాలతో లబ్ధిపొందిన వారి వివరాలు వెల్లడి కానున్నాయి . కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.