ఆరోగ్యశ్రీ పేరుతో మోసం... ఏపీ ప్రభుత్వ పథకాలే హ్యాకర్ల టార్గెట్...

ఆరోగ్యశ్రీ పేరుతో మోసం... ఏపీ ప్రభుత్వమే హ్యాకర్ల టార్గెట్...

ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందే వారిని గుర్తించి... హ్యాకర్లు తెలివిగా బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు కేటుగాళ్లు. అలాంటి ఓ ఘటనకు సంబంధించి ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 • Share this:
  అతనో హ్యాకర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న ఓ వ్యక్తి నంబర్ సేకరించాడు. అతనికి కాల్ చేసి... వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు యత్నించాడు. డబ్బు ఆశ చూపి... అడ్డగోలుగా మోసం చేద్దామని కుట్ర పన్నాడు. ఓ ఫోన్ కాల్ ద్వారానే ఈ మోసం చేసేందుకు రకరకాల డ్రామాలు ఆడాడు. గుంటూరుకు చెందిన ఆ బాధితుడు... హ్యాకర్ అడిగిన ఎన్నో విషయాలకు సమాధానాలు చెప్పాడు. కానీ... సరైన సమయంలో... జాగ్రత్తగా మెలగడం ద్వారా... ఆ హ్యాకర్ ఆటలు సాగకుండా చెయ్యగలిగాడు. వాళ్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇదీ...

  హ్యాకర్ : హలో... నేను ఏపీ ఆరోగ్యశ్రీ సర్వీ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ని.
  బాధితుడు : ఆ చెప్పండి.
  హ్యాకర్ : మీరు ఎక్కడ ఉంటారు?
  బాధితుడు : గుంటూరు జిల్లా
  హ్యాకర్ : ఏం చేస్తారు?
  బాధితుడు : మండపాలకు డెకరేషన్ చేస్తాను.
  హ్యాకర్ : గత టీడీపీ హయాంలో మీరు ఆరోగ్యశ్రీ కార్డు వాడారా?
  బాధితుడు : వాడలేదు. మాకు ఏ ప్రయోజనమూ కలగలేదు.
  హ్యాకర్ : ఐతే... మీకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రూ.35000 ఇవ్వనుంది.
  బాధితుడు : అవునా... మంచిదే.
  హ్యాకర్ : మీకు రైతు భరోసా, అమ్మఒడి, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వంటివి దక్కాయా?
  బాధితుడు : మా అబ్బాయికి అమ్మఒడి ఉంది.
  హ్యాకర్ : రేషన్ కింద రూ.1000 ఇచ్చారా వాలంటీర్లు?
  బాధితుడు : ఆ ఇచ్చారు.
  హ్యాకర్ : మీ భార్య డ్వాక్రాలో ఉన్నారా? లోన్ తీసుకున్నారా?
  బాధితుడు : ఆ ఉంది. లోన్ తీసుకోలేదు.
  హ్యాకర్ : సరే... మీకు రూ.35000 మీ అకౌంట్‌లో వేస్తాను. మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉంది?
  బాధితుడు : రూ.5000 దాకా ఉంది.
  హ్యాకర్ : మీ ఇంట్లో ATM కార్డు ఎవరు వాడుతారు?
  బాధితుడు : నేనే వాడతాను.
  హ్యాకర్ : ఐతే... ఏటీఎం కార్డుపై నంబర్ చెప్పండి.

  ఇలా నంబర్ చెప్పమనగానే... బాధితుడికి అది నకిలీ కాల్ అనీ, కాల్ చేసిన వ్యక్తి హ్యాకర్ అనీ అర్థమైంది. వెంటనే హ్యాకర్‌పై రివర్స్ అయ్యాడు.

  బాధితుడు : ఎందుకు చెప్పాలి? మీకెందుకు చెప్పాలి? అసలెవరు మీరు? ఏటీఎం కార్డుపై నంబర్లు ఎందుకు అడుగుతున్నారు?
  హ్యాకర్ : చెప్పాలి. చెప్పకపోతే... డబ్బులు ఇవ్వాలి కదా. చెప్పాలి.
  బాధితుడు : ఏంటి చెప్పేది? అలా ఎవరైనా అడుగుతారా? ఏటీఎంపై వివరాలు చెప్పొద్దంటారు. మీరెందుకు అడుగుతున్నారు. చెప్పం. అలా చెప్పం.
  హ్యాకర్ : ఒకసారి చెప్పు ప్లీజ్. కార్డు పిన్ అక్కర్లేదు. నంబర్, ఎక్స్‌పైరీ డేట్ చెప్పు.
  బాధితుడు : చెప్పం. అయన్నీ ఎందుకు చెప్తాం. ఎవరు మీరు. ఎందుకు అడుగుతున్నారు. చెప్పనంతే.

  అంటూ బాధితుడు కాల్ కట్ చేశాడు.

  ఇప్పుడు ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. ఎలాగైతే బాధితుడు తెలివిగా తప్పించుకున్నాడో... అదే విధంగా మనం కూడా అప్రమత్తం కావాలి. ఏటీఎంపై వివరాలు ఎవ్వరూ అడగరు. బ్యాంకు వాళ్లు కూడా అడగరు. కాబట్టి... వాటిని ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. అలా ఎవరైనా వివరాలు అడిగితే... వాళ్లు మోసగాళ్లే అని మనం గుర్తించాలి.
  Published by:Krishna Kumar N
  First published: