గుంటూరు జిల్లాలో రొంపిచర్ల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతిచెందారు. వివరాలు.. ప్రకాశం జిల్లా పామర్రు కు చెందిన రమణయ్య తన ఇంటికి పెయింట్ వేపించటం కోసం జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన మధు మేస్త్రి అనే వ్యక్తి ద్వారా నలుగురు పెయింటింగ్ మేస్త్రీలను మాట్లాడుకోవడం జరిగింది. అనంతరం జగిత్యాల నుంచి గురువారం రాత్రి తన సొంత కారులో మహేశ్, బీరుగౌడ్, బాలాజి, ఆనంద్‌లతో కలిసి పామర్రుకు బయలుదేరారు. అయితే వర్షం కారణంగా రొంపిచర్ల వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది.
దీంతో ఘటన స్థలంలోనే నలుగురు మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీసి నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని రొంపిచర్ల ఎస్ఐ తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published by:Sumanth Kanukula
First published:October 16, 2020, 10:02 IST