FOUR BROTHERS FIGHT FOR MANGOES MOTHER TRIES TO CONVINCE THEM ELDER SON KILLED HER IN BIHAR SK
మామిడి పండు కోసం అన్నాదమ్ముళ్ల కొట్లాట.. అడ్డొచ్చిన తల్లిని నరికి చంపేసిన కొడుకు
ప్రతీకాత్మక చిత్రం
మామిడి పండ్ల కోసం అన్నాదమ్ముళ్లు కొట్లాడారు. వారికి సర్దిజెప్పేందుకు తల్లి ప్రయత్నించడంతో.. పెద్ద కుమారుడు ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. బీహార్‌లో ఈ ఘోరం జరిగింది.
మామిడి పండు (Mango) ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. అన్నాదమ్ముళ్లు కొట్టుకునేలా చేసింది. చివరకు వారి తల్లి మరణానికి కారణమైంది. మామిడి పండు కోసం అన్నదమ్ముళ్లతో గొడవపడిన ఓ వ్యక్తి... అడ్డొచ్చిన తల్లిని చంపేశాడు. గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. బీహార్ (Bihar)లోని గోపాల్‌గంజ్‌లో ఈ హృదయ విదారకర ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన ప్రకారం... కుచాయ్కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరిసియా గ్రామానికి చెందిన పవారి మిశ్రా, బటోరా దేవి భార్యాభర్తలు. ఈ దంపతులకు నలుగురు కుమారులు ఉన్నారు. పవారి మిశ్రా కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ప్రస్తుతం బటోరా దేవి వయసు 70 ఏళ్లు. సిరిసియా గ్రామంలో వీరి కుటుంబానికి ఓ మామిడి చెట్టు ఉంది. ఐతే శనివారం ఉదయం నలుగురు అన్నాదమ్ముళ్లు చెట్టు వద్దకు వెళ్లి.. మామిడి పండ్లను తెంచారు. అందరూ పంచుకుంటున్న సమయంలో గొడవ జరిగింది.
మామిడి పండ్ల పంపిణీ విషయంలో అన్నాదమ్ముళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. ఈ విషయం తల్లికి తెలియడంతో ఆమె హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లింది. నలుగురికీ సర్దిచెబుతూ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. గొడవలు వద్దని.. ఎంతో బతిమాలింది. ఐనా వినలేదు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు రామ్ శంకర్ మిశ్రా తల్లిపై గొడ్డలితో దాడి చేశాడు. పదే పదే..మధ్యలో ఎందుకు దూరుతావు అంటూ విరుచుకుపడ్డాడు. గొడ్డలితో పలు మార్లు ఆమెను నరికాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
సమాచారం అందుకున్న కుచాయికోట్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం సదర్ ఆసుపత్రికి తరలించారు. పదునైన ఆయుధంతో పాటు పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడైన కుమారుడిని అరెస్టు చేసి విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. క్షణికావేశంలో రామ్ శంకర్ మిశ్రా ఈ దారుణానికి ఒడిగట్టాడని ఎస్డిపిఓ సంజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఘటన తర్వాత బాధిత కుటుంబంలో గొడవలు మరింత పెరిగాయి. తల్లిని చంపేసిన అన్నపై మిగతా ముగ్గురు తమ్ముళ్లు.. పగ పెంచుకున్నారు. రామ్ శంకర్‌ని మిశ్రాను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.