చురు: రాజస్థాన్‌లోని చురులో అమానుష ఘటన జరిగింది. హోం వర్క్ చేయలేదన్న కారణంగా ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడిని టీచర్ విచక్షణా రహితంగా కొట్టాడు. ఆ దెబ్బలు తాళలేక ఆ పిల్లాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గ్రౌండ్‌లో పడేసి మరీ అమానుషంగా కొట్టడంతో ఆ బాలుడు విలవిలలాడిపోయాడు.
భయంతో గజగజా వణికిపోతూ.. ‘కొట్టొద్దు సార్.. కొట్టొద్దు సార్’ అని బతిమలాడాడు. అయినా ఆ టీచర్ మనసు కరగలేదు. చేతిలో బెత్తం ఉంది కదా అని చావబాదాడు. ఆ పిల్లాడు దెబ్బలకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లా సలసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోలసర్ అనే గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగింది.
బాధిత విద్యార్థి పేరు గణేష్. చావబాదిన ఆ టీచర్ పేరు మనోజ్ కుమార్. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రాజస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ ప్రైవేట్ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. టీచర్ మనోజ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. పోలీసులు ఆ కీచక టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు నమోదు చేశారు.
ఆ స్కూల్‌కు 2003లో గుర్తింపు లభించినట్లు తెలిసింది. ఈ దారుణానికి పాల్పడిన టీచర్ మనోజ్ కుమారే ఆ స్కూల్‌కు హెడ్. గణేష్ మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, Crime news, Private teachers, Rajasthan, Student, Teacher misbehave