news18-telugu
Updated: August 14, 2019, 8:36 AM IST
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేమ్స్ స్ట్రీట్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి ఓ చిన్నారిని ఎత్తుకెళ్లాడు. చిన్నారి తల్లిదండ్రులకు అతను తెలిసిన వ్యక్తే కావడంతో.. సమీపంలోని షాప్‌కి వెళ్లొస్తామని పాపను అతని వద్ద ఉంచి వెళ్లారు. తిరిగొచ్చి చూసేసరికి పాపను తీసుకుని అతను పరారయ్యాడు. దాంతో ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. యాప్రాల్‌కు చెందిన రాజు అనే వ్యక్తి గతంలో చెత్త ఏరే పనిచేసేవాడు. కొన్నేళ్ల క్రితం హజీరా అనే యువతిని అతను వివాహం చేసుకున్నాడు. వీరికి ఫాతిమా(5), రమేష్(4), మౌనిక(3 నెలలు) ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఫాతిమాకు జ్వరం రావడంతో నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యాప్రాల్ నుంచి ప్యాట్నీ వచ్చారు. అక్కడినుంచి జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని నాంపల్లి వెళ్లాలనుకున్నారు.జేమ్స్ స్ట్రీట్‌కు వచ్చాక.. తనకు గతంలో పరిచయం ఉన్న ఓ వ్యక్తి కనిపించాడు. ఒకప్పుడు తనతో పాటు చెత్త ఏరిన వ్యక్తి కావడంతో అతన్ని పలకరించాడు.కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇంతలో పిల్లలు ఏడ్వడంతో.. మిల్క్ తీసుకురావడం కోసం భార్యతో కలిసి సమీపంలోని షాప్‌కు వెళ్లాడు. ఆ సమయంలో రమేష్,మౌనికలను వెంట తీసుకెళ్లగా.. ఫాతిమాను అక్కడే వదిలి వెళ్లారు.అయితే ఆ ఇద్దరూ తిరిగొచ్చి చూడగా.. అక్కడ అతను కనిపించలేదు. ఫాతిమా కూడా లేకపోవడంతో కంగారుపడ్డారు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో
ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Published by:
Srinivas Mittapalli
First published:
August 14, 2019, 8:36 AM IST