రామ్‌గర్: జార్ఖండ్‌లోని రామ్‌గర్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, కారు ఢీ కొన్న ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా.. వెంటనే మంటలు రేగాయి. దీంతో.. కారులోని ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. బస్సులోని 20 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ధన్‌బాద్ నుంచి రాంచీకి ‘మహారాజ’ బస్సు వెళుతోంది. రామ్‌గర్ నుంచి బొకారో వెళుతున్న కారు బస్సును ఢీ కొట్టింది. కారు, బస్సు ఢీకొన్న వెంటనే పెద్ద ఎత్తున మంటలు రేగాయి. కారు ముందు భాగం కూడా నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో కారులో ఉన్న వారు గాయపడి స్పృహ కోల్పోవడం.. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు అలుముకోవడంతో కారులో ఉన్న ఐదుగురు బయటపడే అవకాశం లేకుండా పోయింది.
ఐదుగురూ కారుతో పాటే సజీవ దహనమయ్యారు. రాజ్రప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాద ఘటనను కళ్లారా చూసిన స్థానికులు చెప్పిన దాని ప్రకారం.. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వారు బయటపడే ప్రయత్నం చేసినప్పటికీ కారు డోర్లు ఓపెన్ కాలేదు. దీంతో.. వాళ్లు కారుతో పాటే మంటల్లో కాలిపోయారు. బస్సులో ఉన్న వారంతా వెంటనే అప్రమత్తమై దిగిపోవడంతో ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. బస్సు కూడా మంటల్లో కాలిపోయింది.
ఈ ఘోర ప్రమాద ఘటనతో రామ్‌గర్ టూ బొకారో హైవేపై రాకపోకలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో.. ఇరు వైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా అందులో ఉన్న వారి వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bus accident, Car accident, Crime news