(పి.మహేందర్, న్యూస్18 కరస్పాండెంట్, నిజామాబాద్)
మలేసియాలో ఉద్యోగాలు అనగానే ఎగిరిగంతేసి... వెనుకా ముందూ చూడకుండా వెళ్లి.. అక్కడ అష్టకష్టాలు పడిన ఐదుగురు చెప్పిన కథ ఇది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బద్గుణ గ్రామానికి చెందిన బింగి విజయ్ కుమార్, అల్లాడి సురేష్, ఉమ్మెడ గ్రామానికి చెందిన ప్రసాద్, ఆకుల సంతోష్, మాయాపూర్ చెందిన బాలాగౌడ్ ఉద్యోగం కోసం నవీపేట్ మండలం కౌలాపూర్ గ్రామానికి చెందిన గుర్రం రాజేష్ అనే ఏజెంటు ఆశ్రయించారు. మలేసియాలో ఉద్యోగాల మీద వారికి ఉన్న మోజును ఏజెంట్ క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. వారిని మలేసియాలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నమ్మించి అక్కడకు తీసుకు వెళ్లాడు. అయితే, వర్క్ పర్మిట్ వీసా మీద కాకుండా విజిటింగ్ వీసా మీద వారిని తీసుకెళ్లాడు. కౌలాలంపూర్‌లో దిగిన తర్వాత వారిని అక్కడే వదిలేసి ఏజెంట్ పారిపోయాడు.
మలేసియా వరకు వచ్చి ఉద్యోగం చేయకుండా వెనక్కు వెళ్లడానికి భయపడిన వారు జాబ్స్ కోసం కంపెనీల చుట్టూ తిరిగారు. అయితే, ఎక్కడా వారికి అవకాశం దొరకలేదు. ఈలోపు వారి వీసా గడువు కూడా ముగిసిపోయింది. ఇండియాకు వెళ్లడానికి కాదు కదా.. కనీసం తినడానికి కూడా డబ్బుల్లేని స్థితికి చేరుకున్నారు. చివరకు ఎలాగో ప్రయత్నించి... నిజామాబాద్ జిల్లాలోని తమ కుటుంబసభ్యులకు విషయాన్ని చేరవేశారు.
ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మి.. అప్పులు చేసి మలేసియాకు పంపిన కుటుంబాలు అవి. దీంతో అందరూ కలసి నిజామాబాద్ ఎంపీ కవితను కలిశారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే ఎంపీ కవిత మలేసియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి వారిని వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బాధితులకు తాత్కాలిక పాస్‌పోర్టులు, వీసాలు, టికెట్లకు డబ్బులు సమకూర్చి వారిని క్షేమంగా ఇండియాకు తీసుకొచ్చారు. తమను క్షేమంగా ఇంటికి చేర్చిన జాగృతి నిర్వాహకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
మలేసియాలో ఎదురైన నరకాన్ని వివరించిన బాధితులు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.