FIVE MORE ARRESTED IN GANJA SMUGGLING THROUGH AMAZON ECOMMERCE PLATFORM CASE VISAKHAPATNAM MKS
Visakhapatnam: ఆయుర్వేద మందుల పేరుతో అమెజాన్ ద్వారా Ganja smuggling -విశాఖలో వరుస అరెస్టులు
ప్రతీకాత్మక చిత్రం
ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను విశాఖపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన ముఠా సభ్యుల్లో తండ్రీకొడుకులు ఉండటం గమనార్హం. దీనిపై అధికారులు చెప్పిన వివరాలివి..
దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా సరే దానికి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీ అనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య నిత్యం పట్టుబడుతున్న గంజాయి కేసులే దీనికి నిదర్శనం. తాజాగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను విశాఖ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన ముఠా సభ్యుల్లో తండ్రీకొడుకులు ఉండటం గమనార్హం. అరెస్టయిన వారిలో సీహెచ్ శ్రీనివాసరావు, జే కుమారస్వామి, బీ కృష్ణంరాజు, సీహెచ్ వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు కుమారుడు సీహెచ్ మోహన్‌రాజు అలియాస్ రాఖీ ఉన్నారు. వీరంతా వైజాగ్‌కు చెందిన వారే. నిందితులు విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు అమెజాన్ ద్వారా గంజాయిని సరఫరా చేసేవారు.
విశాఖ కేంద్రంగా భారీ దందా
ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భింద్ పోలీసులు ఆన్లైన్ గంజాయి రాకెట్‌ను ఛేదించి ముగ్గురు యువకులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 20 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి సరఫరా అవుతోందన్న విషయం బయటపడింది. దీంతో విశాఖ పోలీసులు అప్రమత్తమై గంజాయి గ్యాంగ్ ఆట కట్టించారు. గంజాయి రవాణాలో కీలక సూత్రధారిగా ఉన్న చిలకపాటి శ్రీనివాసరావు, అతడి గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.
నవంబర్ 21న విశాఖ కంచరపాలెంలోని శ్రీనివాసరావు అద్దె ఇంట్లో నిల్వ ఉంచిన 48 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వైజాగ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఇబి) జాయింట్ డైరెక్టర్ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. ఇంట్లో గంజాయితో పాటు కవర్లు, కార్డ్బోర్డ్ పెట్టెలు, టేపులు, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ వంటి ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా లభించాయని సతీష్ తెలిపారు.
* ఆయుర్వేదం పేరుతో అక్రమ రవాణా..
డయాబెటిస్ వ్యాధి నివరణకు తయారయ్యే ఆయుర్వేద మెడిసిన్‌లో వాడే ‘సూపర్ నేచురల్ స్టేవియా లీవ్స్’ పేరిట ఈ ఐదుగురు ముఠా సభ్యులు గంజాయి సరఫరా చేస్తున్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ పేరుతో అమెజాన్‌లో విక్రేతగా నమోదైన శ్రీనివాసరావు సీక్రెట్‌గా ఈ దందా నడిపిస్తున్నాడు. అతడికి మధ్యప్రదేశ్‌లోని సూరజ్ పావయ్య, ముకుల్ జైస్వాల్ సహకారం అందిచారని, వారితో పార్సిళ్లను డెలివరీ చేయించేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఇలా గత ఎనిమిది నెలల నుంచి అమెజాన్ ప్లాట్‌ఫామ్ ద్వారా సుమారు 900 కేజీల గంజాయి రవాణా చేసినట్లు గుర్తించామని ఎస్ఇబి జాయింట్ డైరెక్టర్ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. కాగా, ఈ కేసులో కీలక సూత్రధారులు అయిన చిలకపాటి శ్రీనివాసరావు కుమారుడు చిలకపాటి మోహన్ రాజు అమెజాన్ పికప్ బాయ్స్ కుమారస్వామి, వ్యాన్ డ్రైవర్ వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.