news18-telugu
Updated: November 14, 2020, 5:58 PM IST
ప్రతీకాత్మక చిత్రం
'మద్యపానం ఆరోగ్యానికి హానికరం'.. మందు సీసాపైనే ఈ హెచ్చరిక రాసి ఉంటుంది. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోరు. డాక్టర్లు చెప్పినా.. భార్యలు నెత్తినోరు మొత్తుకున్నా.. అస్సలు వినిపించుకోరు. కుటుంబాలు రోడ్డున పడతాయని.. ఆరోగ్యం పాడవుతుందని.. వేడుకున్నా.. మారరు. మద్యం చుక్క లేనిదే చాలా మందికి రోజు గడవదు. ఇక పార్టీలు జరిగినా..స్నేహితులు కలిసినా.. పీకల దాకా మద్యం తాగుతారు. తిండి కూడా తినకుండా.. పొట్ట నిండా లిక్కర్నే నింపుతారు. ఇలా అతిగా మద్యం తాగే.. రాజస్థాన్లో ఐదుగురు మరణించారు. భరత్పూర్ జిల్లా కమాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం భరత్పూర్ జిల్లాలో ఐదుగురు వ్యక్తులు అతిగా మద్యం తాగి మరణించారు. మద్యం ఎక్కువగా తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. నిద్రలోనే కన్నుమూశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ఐదు కుటుంబాల వారిని కలిసి వివరాలు సేకరించారు. ఐతే వారు మోతాదుకు మించి మద్యం తాగడం వల్లే చనిపోయారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కుటుంబ సభ్యులు మాత్రమే అలా చెబుతున్నారు. నలుగురు వ్యక్తులను అప్పటికే ఖననం చేయడంతో.. వారు ఎలా చనిపోయారన్నది గుర్తించడం కష్టమైంది.
ఐదో వ్యక్తి మధురలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిచారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే.. వారి మృతికి గల స్పష్టమైన కారణం తెలుస్తుంది. వారు కల్తీ మద్యం తాగారనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని.. ఎక్కువ మద్యం తాగడం వల్లే చనిపోయి ఉండవచ్చని పోలీసులు చెప్పారు. ఏదేమైనా ఐదో వ్యక్తి పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుందని తెలిపారు. కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 14, 2020, 5:57 PM IST