Petrol: బైక్ లో పెట్రోల్ కొట్టిస్తుండగా.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి తన బుల్లెట్ లో పెట్రోల్ నింపుకునేందుకు బంక్ కు వచ్చాడు. ఫుల్ ట్యాంక్ కొట్టమన్నాడు. సిబ్బంది పెట్రోల్ నింపుతుండగా సడన్ గా బుల్లెట్ నుంచి మంటలు వచ్చాయి. ఆ బుల్లెట్ నుంచి మంటలు ఎలా వచ్చాయన్నది ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

  • Share this:
    పెట్రోల్ బంక్ లో ఉండగా ఫోన్లు మాట్లాడొద్దంటూ ఉండే హెచ్చరిక బోర్డులను మీరు చూసే ఉంటారు. చాలా వరకు వాహనదారులు ఆ సూచనను పాటిస్తూనే ఉంటారు. ఆ సమయంలో ఫోన్ వచ్చినా, దాన్ని పక్కన పెట్టడమో లేక కట్ చేయడమో చేస్తుంటారు. అయితే తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన వాహనదారుల గుండెల్లో గుబులురేపుతోంది. బైక్ లో పెట్రోల్ కొట్టించుకుంటుండగా సడన్ గా మంటలు చెలరేగి వాహనం దగ్ధమయింది. వాహనదారులంతా భయంతో ఆ పెట్రోల్ బంక్ నుంచి పరుగులు తీశారు. ఆ సమయంలో వాహనదారుడే కాదు, పక్కన ఎవరూ ఫోన్లు మాట్లాడటం లేదు కూడా. అయినా సరే ఇదెలా జరిగిందా అని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

    గుంటూరు నగరం ఆంజనేయ పేట ఒకటవ లైన్ కు చెందిన తాయి వెంకట శివప్రసాద్ అనే యువకుడికి బుల్లెట్ బైక్ ఉంది. శనివారం రాత్రి లాడ్జి సెంటర్ లోని పెట్రోల్ బంక్ కు బైక్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి శివప్రసాద్ వెళ్లాడు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఆ బుల్లెట్ లో పెట్రోల్ నింపుతున్న క్రమంలో ఉన్నట్టుండి బైక్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అందరూ భయపడిపోయారు. శివప్రసాద్ ఆ బుల్లెట్ ను అక్కడే వదిలేసి దూరంగా పారిపోయాడు. వాహనదారులంతా తమ వాహనాలను తీసుకుని వెంటనే దూరంగా వెళ్లిపోయారు. కొందరు సిబ్బంది ధైర్యంతో తెగించి, బుల్లెట్ ను కాస్త పక్కకు లాగి, తమ వద్ద ఉన్న ఎమర్జెన్సీ పరికరాలతో ఆ మంటలను ఆపేశారు. పక్కనే బంక్ కార్యాలయ క్యాబిన్ ఈ మంటలకు కాస్త దెబ్బతింది. ఫైర్ ఇంజన్ వచ్చేసరికే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.

    అయితే ఆ బుల్లెట్ నుంచి మంటలు ఎలా వచ్చాయన్నది ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బుల్లెట్ ను ట్యాంక్ ఫుల్ చేసే క్రమంలో కొంత పెట్రోల్ ఇంజన్ పై పడింది. అప్పటికే బుల్లెట్ ఇంజన్ బాగా వేడెక్కి ఉంది. అంత వేడెక్కి ఉన్న ఇంజన్ పై పెట్రోల్ పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్యాంక్ లో ఉన్న లోపల ఉన్న మిగిలిన పెట్రోల్ కూడా తోడవడంతో మంటలు పెద్దగా వ్యాపించాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published: