నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో ఆదివారం తెల్లవారు జామున అకడమిక్ బ్లాక్-1 తరగతి గదిలో ఈ ప్రమాదం జరిగింది. అయితే వాకింగ్‌కు వెళ్తున్న విద్యాలయ ఉద్యోగులు మంటలను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. భైంసా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో పాటు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు 30 నిమిషాల తర్వాత అగ్నిమాపక సిబ్బందిని ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో తరగతి గదిలోని కుర్చీలు, బల్లలు, ప్రొజెక్టర్, కేబుల్ తీగలు మంటలకు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.20 లక్షల నష్టం జరిగిందని ఆర్జీయూకేటీ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై విద్యాలయ అధికారులు బాసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే.. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రెండు నెలల నుంచి విద్యాలయం మూసి ఉన్నా.. తరగతి గదులకు విద్యుత్తు సరఫరా నిలిపివేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Basara, Basara triple IT, Fire Accident