దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులకు చిక్కులు తప్పేలా లేవు. వారి పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌కు సంబందించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? అని హైకోర్టు చీఫ్ జస్టిస్ తెలంగాణ అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించారు. మహారాష్ట్రకు సంబంధించిన ఓ కేసును ఉటంకిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో కూడా పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? అని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. అయితే, ఎన్కౌంటర్ మీద మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. దీనిపై చీఫ్ జస్టిస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదో చేయాలి కాబట్టి చేశామనే విధంగా ఉండకూదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిటిగేషన్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఇక్కడ కూడా అనుసరించాలని కోర్టు స్పష్టం చేసింది. అంటే ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఏడాది జూలైలో ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఓ కీలక వ్యాఖ్య చేసింది. పోలీసుల ఎన్కౌంటర్లో ఎవరైనా ఓ వ్యక్తి చనిపోయినట్లయితే, ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. వారు విచారణను ఎదుర్కోవాలి. మరోవైపు 2006లో ఎనిమిది మంది నక్సల్స్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఓ తీర్పు చెప్పింది. ఆత్మరక్షణ పేరుతో పోలీసులు చట్టం నుంచి తమను తాము రక్షించుకోలేరని, మెజిస్ట్రేట్ దర్యాప్తును పూర్తిస్థాయి విచారణగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, వారు కూడా విచారణను ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత షాద్‌నగర్ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.