Home /News /crime /

FINANCIAL PROBLEMS AND LEADS TO FARMER FAMILY SUICIDE IN MANCHERIAL DISTRICT FULL DETAILS HERE HSN

ఏడాది క్రితం పెళ్లయిన కూతురిని ఇంటికి పిలిచి.. అందరం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామని చెప్పిన తండ్రి.. చివరకు..

కౌలు రైతు కుటుంబం, సూసైడ్ లేఖ

కౌలు రైతు కుటుంబం, సూసైడ్ లేఖ

అప్పులోళ్ల అందరికీ మార్చి 25న బాకీ తీర్చుతానని వాయిదా పెట్టాను. వాళ్లు వచ్చి అడిగితే ఏం చెప్పాలి. ఈ మధ్య తరగతి వాళ్లకు ఇజ్జత్ ఎక్కువ. నలుగురి ముందు ఇజ్జత్ పోతే బతకలేం. నాకే కనుక ఎకరం పొలం ఉంటే దాన్ని అమ్మయినా బతికేటోళ్లం.

  మంచిర్యాలలో కౌలురైతు కుటుంబం ఆత్మహత్య ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన విషయం బయటపడింది. అప్పులు తీర్చలేక తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని సూసైడ్ లేఖను కూడా రాశారు. అదే సమయంలో ఆ లేఖల రాసిన వివరాలు, విషయాలు అందరినీ కంటతడిపెట్టిస్తున్నాయి. సగటు కౌలు రైతు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయి. మార్చి 25న గురువారం డబ్బులు ఇస్తానని అప్పులోళ్లకు మాటిచ్చాననీ, ఇల్లు అమ్మినా అంత డబ్బు రాదని ఆ లేఖలో వాపోయాడు. ఎకరం భూమి ఉన్నా అమ్ముకుని బతికేవాళ్లమన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కెపల్లికి చెందిన 45 ఏళ్ల కౌలు రైతు జంజిరాల రమేష్, 40 ఏళ్ల భార్య పద్మ, 19 ఏళ్ల కుమార్తె సౌమ్య, 16 ఏళ్ల కుమారుడు అక్షయ్ తో కలిసి జీవనం సాగించేవాడు. గతేడాది కుమార్తె సౌమ్యకు ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్లికి అయిన బాకీతోపాటు, అంతకుముందు అయిన బాకీలన్నీ కలిపి రూ.18 లక్షల వరకు ఉంటాయి. బాగా కష్టపడి అప్పులన్నీ తీర్చేయాలని భావించాడు. అదే ఊరికి చెందిన రైతుల వద్ద 30 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తిని వేశాడు. కానీ పత్తి పంట చేతికొచ్చి, పంటను అమ్మితే అన్నీపోనూ కేవలం రూ.3లక్షల రూపాయల మాత్రమే మిగిలాయి. అది కూడా బాకీ కింద వేరొకరికి ఇవ్వాల్సి వచ్చింది. అప్పులన్నీ తీర్చొచ్చని భావిస్తే, సగం డబ్బులైనా తీర్చలేకపోయానని రమేష్ బాధపడ్డాడు. అప్పులోళ్ల ఒత్తిళ్లు కూడా పెరిగిపోవడంతో మనోవేధనకు గురయ్యాడు. తన భార్యతో కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు చివరి సారిగా కుమార్తెను కళ్లారా చూసుకోవాలనుకున్నాడు.
  ఇది కూడా చదవండి: బీటెక్ కుర్రాడు.. డిగ్రీ యువతి.. రాత్రి 10.30గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానంటూ ఆ యువతి బయటకు వచ్చి..

  రెండ్రోజుల క్రితమే అత్తారింటి నుంచి కుమార్తెను తీసుకొచ్చాడు. ఆ రెండ్రోజుల పాటు కుమార్తెతో సంతోషంగా గడిపారు. బుధవారం రాత్రి సమయంలోనే తాము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్టు కుమార్తెకు చెప్పారు. మీరు లేని జీవితం తనకు కూడా వద్దనీ, మీతోనే కలిసి బతికాననీ, మీతోనే కలిసి పోతానని ఆ కుమార్తె అనడంతో చివరకు నలుగురూ కలిసే ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ముందుగా కుమార్తె, కుమారుడికి ఉరి వేసి, ఆ తర్వాత తల్లీతండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం ఉదయం ఇంట్లోంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పక్కింటి వాళ్లు వచ్చిచూస్తే జరిగిన ఘోరం బయటపడింది. దీంతో వాళ్లు పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి సంఘటనా స్థలంలో ఉన్న సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు.

  ‘నాకు తెలివి ఉంది. కానీ పైసా మాత్రం లేదు. అప్పులోళ్ల అందరికీ మార్చి 25న బాకీ తీర్చుతానని వాయిదా పెట్టాను. వాళ్లు వచ్చి అడిగితే ఏం చెప్పాలి. ఈ మధ్య తరగతి వాళ్లకు ఇజ్జత్ ఎక్కువ. నలుగురి ముందు ఇజ్జత్ పోతే బతకలేం. నాకే కనుక ఎకరం పొలం ఉంటే దాన్ని అమ్మయినా బతికేటోళ్లం. ఇప్పుడు ఇల్లు అమ్మితే పది లక్షలు వస్తాయి. కానీ ఇంకా 8 లక్షల రూపాయల వరకు బాకీ ఉంది. ఈ 8 లక్షల అప్పులను తీర్చలేకే మా నాలుగు ప్రాణాలు పోతున్నాయి. 30 ఎకరాల పత్తి వేస్తే వంద క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కైకిళ్లన్నీ పోనూ 3 లక్షల రూపాయలే వచ్చాయి. పోయిన ఏడాది నష్టపోయా, ఈ ఏడాది కూడా లాసే వచ్చింది. బిడ్డ పెళ్లికి కూడా అప్పులు చేశా. మా ఆత్మహత్యలకు ఎవరూ కారణం కాదు. కౌలు రైతు పరిస్థితి ఇంతే. నా పిల్లలు బతికి ఉన్నా అప్పులోళ్లు వాళ్లను అడుగుతుంటారు. అందుకే ఈ నిర్ణయం.‘ అంటూ అతడు రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

  ఇదిలా ఉండగా, ‘‘ఈ నెల 13వ తారీఖే మా మొదటి పెళ్లి రోజును ఘనంగా జరుపుకున్నాం. ఇంతలోనే ఈ దారుణానికి పాల్పడింది. నాకు ఒక్కమాట కూడా చెప్పలేదు. నన్ను వదిలేసి ఎలా వెళ్లిపోయావు‘ అంటూ సౌమ్య భర్త బాధపడుతున్న తీరు అందరినీ కలచి వేస్తోంది.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Crime story, Farmers suicide, Husband kill wife, Mumbai crime, Wife kill husband

  తదుపరి వార్తలు