news18-telugu
Updated: July 26, 2020, 10:59 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ఓ యువతియువకులు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ వ్యవహారం యువతి తండ్రికి నచ్చలేదు. పైగా అందరికీ తెలిస్తే పరువుపోతుందని భయపడిపోయాడు. దీంతో వెంటనే కూతురికి బలవంతంగా వేరే వ్యక్తినిచ్చి వివాహం చేశాడు. వివాహానంతంరం కూతురు అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో తండ్రి ఆగ్రహంతో అల్లారుముద్ధుగా పెంచుకున్న కూతురిని హత్య చేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా తన కూతురు బాత్రూమ్లో జారిపడిందంటూ అందరినీ నమ్మించాడు. కానీ చివరకు పోలీసులకు అనుమానం రావడం.. పోస్టుమార్టంలో అసలు విషయం తేలడంతో కటకటలాపాలయ్యాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా ఉత్తరమేరకు చెందిన బాలాజీ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడికి కూతురు సెంతారకై ఉంది. ఆమె స్థానికంగా ఓ యువకుడిని ప్రేమించింది. సెంతారకై తన ప్రియుడితో కలిసి సాగిస్తున్న ప్రేమ వ్యవహారం తండ్రి బాలాజీకి తెలిసిపోయింది.
కూతురుకు తన ప్రియుడితో వివాహం చేయడం నచ్చని బాలాజీ.. వెంటనే మరో వ్యక్తికి ఇచ్చి బలవంతంగా వివాహం చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో సెంతారకై.. తాళి అయితే కట్టించుకుంది. కానీ అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించింది. ఆ విషయమై తండ్రీకూతిల్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కుటుంబ సభ్యులు సైతం సెంతారకైను బలవంతంగా అత్తారింటికి పంపేందుకు ప్రయత్నించారు. కానీ సెంతారకై దాన్ని ధీటుగా తిప్పికొట్టింది. దీంతో తన కూతురు ఆ యువకుడితో ఎక్కడ పారిపోతుందోనన్న ఆందోళన తండ్రి బాలాజీకి పట్టుకుంది.
అలా చేస్తే సమాజంలో పరువుపోతుందని భయపడిపోయాడు. కూతురు ఎంత చెప్పినా వినకపోవడంతో తరచూ గొడవ జరుగుతుంది. దీంతో రెండు రోజుల క్రితం సెంతారకైను తండ్రి బాలాజీ గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం బాత్రూమ్లో కాలుజారి పడి చనిపోయిందని అందరినీ నమ్మించాడు. అయితే సెంతారకై మృతిపట్ల పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు.
పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం వెలుగులోకి రావడంతో అంతా షాకయ్యారు. పరువు కోసం కన్నకూతురిని గొంతు నులిమి చంపడం.. దాన్ని కుటుంబ సభ్యులు సమర్ధిస్తూ బాత్రూమ్లో కాలు జారిపడి చనిపోయిందంటూ నమ్మించే ప్రయత్నం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by:
Narsimha Badhini
First published:
July 26, 2020, 10:59 AM IST