భార్యతో గొడవ.. నిద్రలోంచి మేల్కొని బాబు ఏడుస్తోంటే ఓ భర్త ఘోరమిది.. ఆరేళ్ల తర్వాత పుట్టిన బిడ్డను ఎనిమిది నెలలకే..

ప్రతీకాత్మక చిత్రం

ఆరేళ్లుగా ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నారు. ఎందరో డాక్టర్లను కలిశారు. చివరకు వారి ఆశలు ఫలించాయి. ఆరేళ్ల తర్వాత ఆమె గర్భవతి అయింది. ఎనిమిది నెలల క్రితమే స్పందన ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. చివరకు..

 • Share this:
  ఒకటి కాదు రెండు కాదు ఆరేళ్ల తర్వాత ఆ భార్యాభర్తలకు సంతానం అందింది. ఎన్నో దేవుళ్లకు మొక్కుకుంటే, ఎన్నో మొక్కులు చెల్లిస్తే వరంలా ఓ బాబు పుట్టాడని ఆ తల్లి సంతోషపడింది. పిల్లాడిని అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. క్షణం కూడా విడిచి ఉండలేనంత ప్రేమను పెంచుకుంది. ప్రస్తుతం ఆ బాబు వయసు ఎనిమిది నెలలు. కానీ ఇంతలోనే ఆ బాబుకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. కన్న కొడుకు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. తన బిడ్డ మృతికి కట్టుకున్న భర్తే కారణమని తెలిసి ఆమె గుండె పగిలిపోయింది. తాగిన మత్తులో అతడు చేసిన నిర్వాకానికి అభం శుభం తెలియని పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తెలిసి కుటుంబమంతా కన్నీటిపర్యంతమవుతోంది. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లికి చెందిన విక్రమ్ అనే వ్యక్తికి స్పందన అనే యువతితో ఆరేళ్ల క్రితమే పెళ్లయింది. పెళ్లయిన కొద్ది నెలల నుంచే సంతానం కోసం ప్రయత్నించారు. డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎన్ని మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఆరేళ్లుగా ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నారు. ఎందరో డాక్టర్లను కలిశారు. చివరకు వారి ఆశలు ఫలించాయి. ఆరేళ్ల తర్వాత ఆమె గర్భవతి అయింది. ఎనిమిది నెలల క్రితమే స్పందన ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆరేళ్ల తర్వాత ఆ బాబు పుట్టడంతో స్పందన ఎంతగానో సంతోషించింది. బాబును కంటికి రెప్పలా చూసుకునేది. క్షణం కూడా బాబును విడిచి ఉండేది కాదు.

  ఎనిమిది నెలలుగా కొడుకును అల్లారుముద్దుగా చూసుకుంటోంది. అయితే విక్రమ్ కు మొదటి నుంచి మద్యం అలవాటు ఉంది. ఇటీవల అది ఇంకాస్త ఎక్కువ అయింది. మద్యానికి బానిస కావడంతో భర్తతో స్పందన గొడవపడేది. మద్యం అలవాటును మానుకోమని పోరు పెట్టేది. మంగళవారం రాత్రి కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న విక్రమ్ కు ఆమె మాటలు చెవికెక్కలేదు. వారి గొడవ పడుతున్న సమయంలో బాబు ఏడుపు మొదలు పెట్టాడు. అంతే, విక్రమ్ లో విచక్షణ నశించింది. బాబును ఎత్తుకెళ్లి నీళ్ల సంపులో పడేశాడు. భార్య ఈ ఘటన నుంచి తేరుకుని చుట్టుపక్కల వాళ్ల సాయంతో ఆ బాబును రక్షించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మృతదేహం వద్ద ఆమె కుప్పకూలిపోయి ఏడుస్తున్న తీరు అందరినీ కలచివేసింది. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విక్రమ్ ను అదుపులోకి తీసుకున్నారు.
  Published by:Hasaan Kandula
  First published: